అనంతలో ‘ప్రజా ఉద్యమం’ !!

అనంతపురం బ్యూరో, (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ ప్రారంభించింది. అనంతపురంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) పేరుతో తన బంధువులు, వర్గాలకు ఆదాయం సమకూర్చడం కోసం దారాదత్తం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 22వ తేదీ వరకు సంతకాల సేకరణ కొనసాగుతుందని, ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపడతామని తెలిపారు. ఈ ప్రజా ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాలు, వామపక్షాలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.
వైఎస్ జగన్ హయాంలో వైద్య రంగంలో పురోగతి..
రాష్ట్రంలో 2019కి ముందు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవని, కానీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రూ.8300 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
కోవిడ్ తర్వాత ప్రారంభించి రెండేళ్లలోనే ఏడు మెడికల్ కళాశాలలను పూర్తి చేశారని, 2023–2024లో ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. కేవలం కళాశాలల నిర్మాణం మాత్రమే కాకుండా, రూ.3850 కోట్లతో ఆస్పత్రుల ఆధునీకరణ, రూ. 700 కోట్లతో విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు, ప్రతి ఆస్పత్రిలో జీరో వేకెన్సీ విధానంతో పోస్టుల భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
మునుపటి ప్రైవేటీకరణ ప్రయత్నాల ప్రస్తావన
కూటమి ప్రభుత్వం వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్లలో మందులు లేకపోవడం, పీహెచ్‌సీలు నిర్వీర్యం కావడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998లో అనంతపురం మెడికల్ కళాశాలను ట్రస్ట్‌కు అప్పగించాలని చూశారని, అప్పుడు తాను పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా ఉద్యమం చేయడంతో చంద్రబాబు దిగి వచ్చారని గుర్తు చేసుకున్నారు.
అలాగే, ఉమ్మడి ఏపీలో 1992లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చూడగా, పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని నాటి సంఘటనలను ఉటంకించారు.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమీక్షించుకుని ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజా ఉద్యమం కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
