ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఖానాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “పోలీస్ లేకుండా రక్షణ అనేది శూన్యం” అని పేర్కొన్నారు. ప్రతి సామాజిక కార్యక్రమంలో పోలీసుల పాత్ర అత్యంత ముఖ్యమని ఆయన చెప్పారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, “ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 21 మంది పోలీసు సిబ్బంది నక్సలైట్ల చేతిలో అమరులైన విషయం ఎంతో బాధాకరం. నలుగురు ఎస్ఐలు, ఇద్దరు సీఐలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం” అని తెలిపారు.
వారోత్సవాల భాగంగా విద్యార్థుల కోసం రెండు కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం, ఆత్మ చైర్మన్ తోట సత్యం, కాంగ్రెస్ నాయకులు దయానంద్, నిమ్మల రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడార్ల గంగ నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు, పోలీస్ సిబ్బంది కొవ్వొత్తులతో పాల్గొన్నారు.

