‘అన్నా.. మన హైదరాబాద్ ఇక ఇంతేనా..?’ భారీ వర్షాలు (Heavy rains) కురిసినప్పుడల్లా మన హైదరాబాద్ (Hyderabad) లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వీధులన్నీ నదులుగా మారుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై నీళ్లు నిల్వడంతో ట్రాఫిక్ జామై వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కూకట్ పల్లి తులసీ నగర్ సహా చాలా చోట్ల వరద బీభత్సం సృష్టించింది. ‘అన్నా.. మన HYD ఇక ఇంతేనా..?’ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై.. రోడ్లపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ఏ(Traffic jam) ఏర్పడింది. వాహనాలన్నీ ఇరుక్కుపోయాయా అన్నట్లు పరిస్థితి ఏర్పడింది. ఎల్బీనగర్- చాదర్ ఘాట్, నాంపల్లి- ఎంజే మార్కెట్, కూకట్పల్లి- పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్- పంజగుట్ట, మెహిదీపట్నం- లక్ష్మీకపూల్, మెట్టుగూడ- నాగోల్, బేగంపేట- సికింద్రాబాద్ తదితర ప్రధాన రోడ్లల్లో వాహనాలు కిలోమీటర్ల మేర వందల్లో బైకులు, కార్లు ఆగాయి.
వర్షం కురిస్తే.. చుక్కలే..!
సాధారణంగా వర్షం కురిసినప్పుడు చుక్కలు కనిపించవు. కానీ హైదరాబాద్ లో వర్షం కురిస్తే మాత్రం ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. అందులోనూ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే పీక్ అవర్స్ (Peak hours)లో వాన పడితే ఇక అంతే సంగతులు. ఎన్ని అక్రమ కట్టడాలు (Illegal constructions) కూల్చివేసినా, ఎన్ని ఫ్లెఓవర్లు నిర్మించినా, ఎంత మంది ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) చర్యలు తీసుకున్నా నగరంలో వరద బీభత్సంతోపాటు ట్రాఫిక్ సమస్య (Traffic problem) తగ్గడం లేదని నగరవాసులు వాపోతున్నారు.
వరద సమస్యకు చర్యలు చేపట్టేనా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. ఏకధాటిగా కురిసే భారీ వర్షాలకు వరద ఉప్పొంగి, ఎప్పుడు ముంచెత్తుతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. చినుకు పడితే చాలు నగరంలో ఏదో ఒక చోట వరద సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. నగరవాసులు వరద సమస్య నుంచి బయటపడడానికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.