రూ. 150 కోట్లతో టెండర్ ప్రక్రియ
తెలంగాణ కు 50 వేల టన్నుల యూరియా
ఆర్ ఎఫ్ సి ఎల్ లోపాలపై విచారణ జరపండి
పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ఆంధ్ర ప్రభ, గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించిందని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల కోరిక త్వరలో తీరబోతుందని, రూ.150 కోట్ల రూపాయలతో నిర్మాణం కాబోయే ఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి టెండర్ ప్రక్రియ జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణలో యూరియా సమస్య తీవ్రంగా ఉందని, రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించడం జరిగిందన్నారు. రాష్ట్రానికి తొమ్మిది లక్షల టన్నుల యూరియా కు గాను నాలుగున్నర లక్షల టన్నులను మాత్రమే ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియాను అందించేందుకు కేంద్రమంత్రి నడ్డా ఒప్పుకున్నారని ఎంపీ చెప్పారు. అయితే వచ్చే వారం పది రోజుల్లో 25 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి సరఫరా జరుగుతోందని, మిగతా 25 వేల టన్నుల యూరియా మరో దఫా సరఫరా జరుగుతుందన్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారంలో లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపణలు చేశారు. ప్లాంట్ లో లోపలకు అధికారుల నిర్లక్ష్యం కారణమన్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న యూరియా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆర్ ఎఫ్ సి ఎల్ లోపాలపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండలం కన్నాలలో సుమారు రూ.80 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు గుమ్మడి కుమారస్వామి, కల్వల సంజీవ్ ,బోయిని మల్లేష్ యాదవ్, అనుమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.