- పోలీస్ స్టేషన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు
- ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మంజూరైన పోలీస్ స్టేషన్లను ఈనెల 13న రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) లు ప్రారంభించనున్నారు. నూతనంగా మంజూరైన పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు ఎలిగేడు పోలీస్ స్టేషన్ ను మంత్రులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందించనున్నారు. మంత్రుల పర్యటన ఖరారైందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధికారులకు తెలియజేయడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
దశాబ్దాల కాలంగా ఎలిగేడు పోలీస్ స్టేషన్ కోసం ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా పోలీస్ స్టేషన్లను మంజూరు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఎలిగేడు మండలానికి తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం ఉండగా పోలీస్ స్టేషన్ లేకపోవడంతో మండల ప్రజలు జూలపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలిగేడు పోలీస్ స్టేషన్ మంజూరు పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ పెద్దపల్లి (Peddapalli) లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కమిషనరేట్ నుండి అధికారులను, సిబ్బందిని కేటాయించి గత కొన్నేళ్లుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్నారు.
అధికారికంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు కావడంతో పాటు మహిళల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాకు మహిళా పోలీస్ స్టేషన్ మంజూరు చేశారు. దీంతో మహిళల సమస్యలు మరింత తొందరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ల సముదాయాన్ని నిర్మించి, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిన వాటిని వారికి అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. డబుల్ బెడ్ రూమ్ సముదాయాల వద్ద విద్యుత్, రోడ్ల సౌకర్యం లేకపోవడంతో ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వం చే నిధులు మంజూరు చేయించి వసతులు కల్పించారు. దీంతో నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేరబోతుంది.