బాధితుల ఆందోళన
హిందూపురం, అక్టోబర్ 8 (ఆంధ్రప్రభ) : సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని ఎస్బిఐ బ్యాంకు (SBI bank) ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో భారీ దోపిడీ జరిగిన విషయం అందరికీ విదితమే. ఈసందర్భంగా కార్మిక నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ… బ్యాంకు దోపిడీ జరిగిన సమయంలో బాధితుల సొమ్ము 15 రోజులలోపు చెల్లిస్తామని బ్యాంకు వారు చెప్పారని, కానీ 3 నెలలు కావస్తున్నా బాధితుల సొమ్ము చెల్లించడం లేదన్నారు.
అంతేకాకుండా 20రోజుల క్రితం 30 రోజుల క్రితం అగ్రిమెంటు రాయించుకొని ఇప్పటికీ చెల్లించడం లేదన్నారు. రోజు రోజుకు బంగారు విలువ పెరుగుతోందని.. ఎప్పటిదో పాత రేటు ఇస్తే తాము తీసుకోమని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఖాతాదారుల పట్ల బ్యాంకు సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఖాతాదారులు మండిపడుతున్నారు.
కొంతమంది బాధితులు తమ కుమార్తె పెళ్లి.. అందువల్ల మా సొమ్ము చెల్లించాలని లేనియెడల వివాహం ఆగిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా బ్యాంకు సిబ్బంది (Bank staff) లో ఎటువంటి స్పందన లేకపోయిందన్నారు. బ్యాంకు దోపిడీ జరిగిన సమయం నుండి తమ సొమ్ము వాపసు ఇచ్చేంతవరకు వడ్డీ తాము చెల్లించబోమని, తులానికి ఒక గ్రాము తరుగు తీసివేస్తామని బ్యాంకు వారు చెబుతున్నారన్నారు.
దీనివల్ల బాధితులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో ఎక్కువమంది దిన కూలీలు, రైతులు (Farmers), కార్మికులు బాధితులు కావడం గమనార్హం. ఇప్పటికైనా ఎస్బిఐ ఉన్నతాధికారులు స్పందించి ఈరోజు రేటు బంగారు విలువ ఏముందో అది బాధితులకు చెల్లించాలని లేనియెడల దశల వారి నిరసనలు తెలుపుతామని బ్యాంకు వారిని హెచ్చరించారు. కార్యక్రమంలో దాదాపు 70 మంది బాధితులు పాల్గొన్నారు.