Panchayat Elections | ఉరుకులు.. పరుగుల్లో ప్రధాన పార్టీలు

Panchayat Elections | ఉరుకులు.. పరుగుల్లో ప్రధాన పార్టీలు

  • బలమైన అభ్యర్ధుల వేటలో ప్రధాన పార్టీలు
  • ప్రజా బలం, ఆర్థిక బలం ఉన్నవారికే టిక్కెట్లు

డోంగ్లి, ఆంధ్రప్రభ : రెండు సంవత్సరాల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం గత వారం పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసింది. మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఇందులో బాగంగా డోంగ్లీ మండలంలో మూడో విడత డిసెంబర్17న ఎన్నిక జరగనుంది. ఇతర ప్రాంతాల్లో పోలిస్తే డోంగ్లీ కొంత సమయం ఎక్కువగా దొరకడం వల్ల రాజకీయ పార్టీల నాయకులు పల్లె ప్రాంతాలకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి కొంతమంది నాయకులు కమిటీలుగా ఏర్పడి ప్రతి పంచాయతీ తిరుగుతూ పోటీకి ఆసక్తి ఉన్న వారి పేర్లు తీసుకుంటున్నారు. ప్రతి పంచాయతీ నుండి ఇద్దరు, ముగ్గురు పేర్లు చొప్పున లిస్టు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా తీసుకున్న లిస్టును ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముందు పెట్టనున్నారు.

ఈ పేర్లు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. కొన్ని పంచాయతీలో కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కొనున్న నేపద్యం లో అక్కడ అభ్యర్ధి విషయం లో కొంత జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బిఆర్ఎస్ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేనా..?

బిఆర్ఎస్ గత పంచాయతీ ఎన్నికల్లో డోంగ్లి మండలంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది. 12 పంచాయతీలలో 11 స్థానాల్లో విజయం సాధించింది. అంతటి విజయం ఈసారి సాధించే పరిస్తితి అసలే కనబడటం లేదు. రాజకీయ సమీకరణ లో చోటుచేసుకున్న మార్పులు, అధికారం లేకపోవడం బిఆర్ఎస్ కు కష్టకాలంగా మారింది.

మెజారిటీ మాజీ సర్పంచులు అధికార పార్టీ వైపు వెళ్లిపోగా కొద్ది మంది మాత్రమే పార్టీని అంటి బెట్టుకొని ఉన్నారు. వీరిని కాపాడుకునే నాయకత్వం పూర్తి స్థాయి సమయం కేటాయించక పోవడం ఆ పార్టీకి నష్టమనే చెప్పాలి.

అయితే బిఆర్ఎస్ మాత్రం ఎక్కడ రాజి పడకుండా పంచాయతీ ఎన్నికల్లో ముందుకుసాగడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా.. సీనియర్లు పోటికి ముందుకు రాకపోవడంతో, పార్టీ మారిన స్థానాల్లో ద్వితీయనాయకత్వాన్ని పరిగణలోకి తీసుకొని వారికి అవకాశం ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది.

బిఆర్ఎస్ లోనే కొనసాగుతున్న మాజీ సర్పంచులకే మళ్ళీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్న వారు మాత్రం ససేమిరా అంటున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో క్యాండిడేట్లు వెతుకులాటలో నాయకులు బిజీబిజీగా ఉన్నారు.

ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే డోంగ్లి మండలంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన బిజెపి పార్టీ అభ్యర్థులు దొరకక అయోమయంలో ఉందని ప్రజల్లో చర్చ జోరుగా సాగుతుంది. అయినప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వేటలో సఫలమైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply