నిధులే లేవు అభివృద్ధి ఎలా?

నిధులే లేవు అభివృద్ధి ఎలా?

  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్
  • పాలమూరు ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రగతి పాలన 99 రోజుల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో చాలా వరకు ఇప్పటికీ అమలు కాలేదని, కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే జరుగుతోందని అన్నారు.

పెన్షన్లు రూ.2 వేల నుంచి రూ.4 వేలుగా పెంచుతామని చెప్పినా అమలు కాలేదని, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ కూడా అందలేదని తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేల ఇస్తామని చెప్పి తరువాత రూ.12 వేలకే తగ్గించారని, అది కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందలేదని ఆరోపించారు.

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, గ్రాడ్యుయేషన్ చదివే యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అర్హులకు ఇండ్లు మంజూరు కాకపోవడంతో ప్రజలు అధికారులు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు కానీ వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తామని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఆ నిధులతో గురుకులాలు,వసతి గృహాలలో సరైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సమస్యలు తీర్చాలని పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కేంద్ర నిధులను వినియోగించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త ప్రణాళికలు ప్రకటించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.

ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు పద్మజా రెడ్డి, కొండయ్య, కొండ ప్రశాంత్ రెడ్డి కార్పొరేటర్లు పాండురంగారెడ్డి,కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply