నేడు పాక్, భారత్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు పండగే..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) 2025లో మరోసారి ఢీకొనడానికి భారత్ (India)- పాకిస్థాన్ (Pakistan) జట్లు సిద్ధమయ్యాయి. సూపర్ 4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) ఈ రెండు జట్లు తలపడనున్నాయి. టీమ్ఇండియా (Team India) గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గి మంచి ఊపు మీద ఉంది. నేటి సూపర్ 4 మ్యాచ్‌లోనూ పాక్‌పై ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు టీమ్ఇండియాపై ఈసారైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని పాక్ భావిస్తోంది. దుబాయ్ (Dubai) వేదికగా ఆదివారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఎదురులేని భారత్
గ్రూప్ స్టేజ్‌లో వరుసగా మూడు విజయాలు, ఫామ్‌లో ఆటగాళ్లు. భారత్ పటిష్ఠ జట్టుతో సూపర్ 4 స్టేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రీసెంట్గా ఒమన్‌తో మ్యాచ్‌లో నెగ్గినా, అది భారత్ స్థాయికి తగ్గ విజయం కాదు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు తడబడ్డారనే చెప్పాలి. పాక్‌తో పోరు ముంగిట ఇలాంటి ప్రదర్శన కాస్త కలవర పెడుతుంది. కానీ, పాక్‌తో మ్యాచ్ అనగానే భారత్ తిరిగి పుంజుకోవడం పక్కా. ఆదివారం కూడా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అక్షర్ పటేల్ ఆడటం అనుమానమే..
పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (All-rounder Axar Patel) బరిలోకి దిగడం అనుమానంగా మారింది. శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తలకు గాయమైంది. అక్షర్ క్యాచ్‌ను అందుకునే క్రమంలోనే కిందపడగా తల మైదానానికి బలంగా తాకింది. దీంతో మైదానాన్ని వీడిన అక్షర్ మళ్లీ ఫీల్డ్‌లోకి రాలేదు. రింకూ సింగ్ (Rinku Singh) సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. దీంతో అతను పాక్‌తో మ్యాచ్ ఆడతాడా?.. లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై..
పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) అనంతరం పాక్‌తో మ్యాచ్ అంటే కొంతమంది అభిమానులు బాయ్‌కాట్ అంటూ ట్రెండ్ చేశారు. ఇది గతవారం గ్రూప్ స్టేజ్‌లో పాక్‌తో మ్యాచ్‌కు ముందు పరిస్థితి. అయితే ఈ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించాలని పీసీబీ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించిందితద్వారా ఈ వ్యవహారం వివాదానికి దారితీయడం జరిగింది. నో షేక్ హ్యాండ్ వివాదం తరువాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
భారత్ జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.
పాకిస్థాన్ జట్టు: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్, హుస్సేన్ తలత్, హసన్ అలీ, ఖుష్దిల్ షా, హారిస్ రౌఫ్, మహమ్మద్ వసీమ్ జూనియర్, సల్మాన్ మీర్జా.

