విజయవాడ: ఇంటి యజమానిని హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పరారైన ఘటన విజయవాడ (Vijayawada) లో చోటుచేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు (Venkata Rama Rao) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె కూడా వారితో పాటు ఉంటోంది.
ఈ క్రమంలో గత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి వచ్చి చూడగా మంచం పై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మంచం మీద, రామారావుపై కారం చల్లి ఉంది. పని మనిషి అనూష (Anusha) కనిపించలేదు. బీరువా పగులగొట్టి ఉంది. పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. మాచవరం (Machavaram) పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పని మనిషి అనూషను తెల్లవారుజామున 6 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితురాలు తన భర్త సాయంతో రామారావు ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు.