Outpost | ఏసీబీ ఉచ్చులో ఇన్‌స్పెక్టర్, ఎస్సై..

Outpost | ఏసీబీ ఉచ్చులో ఇన్‌స్పెక్టర్, ఎస్సై..

Outpost | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న ఇద్దరు పోలీసు అధికారులను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

నిన్న సాయంత్రం ప్రారంభమైన ఏసీబీ దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర్‌లను రూ.2 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌తో ప్రయాణించేందుకు ప్రయత్నించగా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించి, జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు హాజరవుతున్నాడు.

ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఇన్‌స్పెక్టర్, ఎస్సై కలిసి బాధితుడి నుంచి రూ.15 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. బాధితుడి కుటుంబ సభ్యులను కూడా కేసులో చేర్చుతామని బెదిరించారని తెలిపారు.

అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేనని చెప్పిన బాధితుడు చివరకు రూ.5 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో వారు పక్కా ప్రణాళికతో ఉచ్చు బిగించారు. మొదటి విడతగా బాధితుడు రూ.2 లక్షలు నగదు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇవాళ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.30లక్షలకు పైగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కనకయ్యను కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply