- గ్రామాల్లో మౌలిక సదుపాయాలనే ప్రభుత్వ లక్ష్యం
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బయ్యారం, మార్చి 20(ఆంధ్రప్రభ ) : తమది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్నివర్గాల ప్రజలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం సర్వతో మూఖాభివృద్ధి చెందుతుందని, గాంధీ మహాత్ముని మాటలను నిజం చేయడం కోసం పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందన్నారు.
బయ్యారం, గార్ల మండలాల్లో రైతులు రెండు పంటలు పండే విధంగా దేవాదుల నుండి ఎత్తిపోతల ద్వారా బయ్యారం చెరువుకు నీరు తరలిం చేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి కృషి చేస్తానని రైతులకు తెలిపారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్ నాధ్ కెకన్, తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.