AP | ప్రజాసేవకే మా కుటుంబం అంకితం… నారా భువనేశ్వరి

కుప్పం, మార్చి 28 (ఆంధ్రప్రభ) : ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని నారా భువనేశ్వరి అన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని అన్నారు. గత పాలకులు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. 3వ రోజు కుప్పం నియోజకవర్గం పర్య టనలో భాగంగా శాంతిపురం మండలం నక్కలపల్లి, రామకుప్పం మండలం కొంగనపల్లిలో నారా భువనేశ్వరి పర్యటించారు. నక్కలపల్లిలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలోని రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మల్బరీ తోటలను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఆ తర్వాత పట్టు పరిశ్రమలను సందర్శించారు. పట్టు పురుగుల నుంచి దారం తయారీ విధానంపై అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. పట్టు మహిళా రైతులతో సమావేశమైన నారా భువనేశ్వరి మహిళలు భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేస్తే సాధించలేనిది ఏం లేదన్నారు. నిజం గెలవాలి యాత్ర చేయడానికి నేను భయపడ్డానని నిత్యం ప్రజాసేవలో ఉండే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన ప్పుడు మేము చాలా బాధపడ్డామని ఆమె తెలిపారు.

ఆసమయంలో ప్రపంచంలోని తెలుగు వారంతా ఆయనకు మద్దతుగా నిలబడ్డారని గుర్తు చేశారు. టీడీపీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలు అందించిన ప్రోత్సాహం, ధైర్యంతో తాను యాత్రను కొనసాగించానని యాత్ర చేసేప్పుడు అన్నివర్గాల ప్రజలను కలిసే అవకాశం, వారి కష్టసుఖాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం త‌నకు కలిగిందన్నారు. చంద్రబాబు మహిళల కోసం రూపొందించి అమలు చేసిన పథకాల గురించి వారు త‌నకు చెబుతుంటే ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, మండల తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *