ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం…

ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం…
ప్రజల కోసం పోరాటమే మా లక్ష్యం
ఎన్టీఆర్ ఆశయాల సాధనలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి..
ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు..
తిరువూరులో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తిరువూరు, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగాలి. ప్రజల కోసం పోరాటమే మా పార్టీ లక్ష్యం అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తిరువూరు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మధిర రోడ్డు సెంటర్‌లో ఎన్టీఆర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు గజమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయంలో పసుపు జెండాను ఎగరవేశారు.
అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని అధికారంలోకి రావడం తెలుగు ప్రజల శక్తిని దేశానికి చాటింది. ఆ ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని అన్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, “ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే ఎన్టీఆర్ గారిని కలవడం నా జీవితంలో కీలక మలుపు. అనంతరం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ప్రత్యక్షంగా చూశాను అని పేర్కొన్నారు.

రాజధాని అంశంపై నేను చేసిన ప్రసంగం నచ్చి చంద్రబాబు నన్ను పిలిపించి అభినందించారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. అమరావతి రైతుల ఉద్యమంలో కూడా నేను పాల్గొన్నాను అని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర అవసరాన్ని ముందుగా ప్రస్తావించిన వారిలో నేనొకడిని. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేష్ వరకు మూడు తరాల నాయకత్వంతో నా అనుబంధం కొనసాగడం విశేషం అని అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలంగా నిలబడేందుకు కృషి చేయాలి.

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలి” అని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలతో కలిసి పార్టీ గీతాలకు చిందులు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను సన్మానించి, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
