Organ Donation | ఆమె చిరంజీవే.. 8మందికి ప్రాణదానం

నంద్యాల బ్యూరో, జూన్ 6, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని తేళ్లపూరి గ్రామపంచాయతీలో పంచాయతీ సెక్రెటరీగా పనిచేస్తున్న సుజాత (28) మోటార్ బైక్ పై డ్యూటీకి వస్తూ ప్రమాదవశాత్తు కిందపడి బ్రెయిన్ డెడ్ తో మరణించిందని తల్లిదండ్రులు నాగేంద్ర పుల్లమ్మలు తెలిపారు. ఆమె మరణం 8మంది జీవితాల్లో వెలుగులు నింపడం విశేషం. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన పుల్లమ్మ, నాగేంద్రులది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి పెళ్లి అయ్యి వెళ్ళిపోయింది. చిన్న కూతురు సుజాత కష్టపడి చదివింది. 2018లో వచ్చిన నోటిఫికేషలో 2020 సంవత్సరంలో పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం సంపాదించింది.

రోజూ గుంతనాల గ్రామం నుంచి తేళ్లపూరికి విధుల నిమిత్తం డ్యూటీకి హాజరయ్యేది. గ్రామంలో పంచాయతీ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ సుజాత మంచి పేరు తెచ్చుకున్నది. ఎన్టీఆర్ జయంతి రోజు (మే 28)న విధుల కోసం గోస్పాడుకు వచ్చి అక్కడి నుంచి తేళ్లపూరికి మోటార్ సైకిల్ పై వెళ్తుండ‌గా మార్గమధ్యంలో స్లీప్ పై కింద పడిపోవటంతో మెదడుకు పక్కనున్న రాయి కొట్టుకోవడం జరిగిందన్నారు. వెంటనే ఆమెను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక శుక్రవారం మరణించింది. అయితే ఆమె మ‌ర‌ణించినా చిరంజీవే అని చెప్ప‌వ‌చ్చు. తాను చ‌నిపోయినా కొంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాల‌న్న‌ ఉద్దేశంతో అవయవాలైన కళ్ళు, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులను కూడా దానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. నంద్యాల జిల్లాలో మొట్టమొదటి అవయవదాతగా సుజాత చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొంటున్నారు. సుజాత పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply