కర్నూలు, (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన 39 ఏళ్ల టి.శివరామ సుబ్బయ్య తన అవయవాలను దానం చేసి ముగ్గురికి కొత్త జీవితం ఇచ్చారు.
ఆగస్టు 10న స్నేహితులతో కలిసి సమీపంలోని నదికి చేపలు పట్టడానికి వెళ్లిన సుబ్బయ్య, జారి పడటంతో తలకు పెద్ద రాయి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. మొదట జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, అక్కడి నుంచి కర్నూలు ఓమ్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆగస్టు 11న మెడికవర్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే ఆగస్టు 12న వైద్యులు ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు.
ఈ సమయంలో మెడికవర్ వైద్యులు ‘జీవన్‌దాన్’ అవయవ దానం కార్యక్రమం గురించి కుటుంబానికి వివరించగా, భార్య రామసుబమ్మ ధైర్యంగా ముందుకు వచ్చి అంగీకరించారు. సుబ్బయ్య పేరు ఎప్పటికీ నిలవాలన్న సంకల్పంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు.
సేకరించిన అవయవాల్లో ఒక కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్‌కి, మరో కిడ్నీని కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో మార్పిడి చేశారు. కాలేయాన్ని కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌కి పంపించారు. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ సాయి సుధీర్ నేతృత్వంలో డా. అబ్దుల్ సమద్, డా. సిద్ధార్థ, డా. బి. ప్రవీణ్, డా. శరత్ తదితరులు పాల్గొన్నారు.
మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “అవయవ దానం ప్రాణానికి ఇచ్చే గొప్ప బహుమతి. సుబ్బయ్య పేరు ఆయన కాపాడిన ప్రాణాల్లో ఎప్పటికీ నిలుస్తుంది” అన్నారు. గ్రీన్ డోనర్‌గా నిలిచిన సుబ్బయ్య కుటుంబాన్ని వైద్యులు సత్కరించారు. వైద్యులు, సిబ్బంది ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

