ఎమ్మెల్యే అర్హతపై కొనసాగుతున్నవిచారణ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ (Congress)లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటీషన్లపై ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ ప్రారంభించారు. ఈ విచారణ సాయంత్రం వరకూ కొనసాగునున్నది.
రాజ్యాంగంలోని షెడ్యూల్-10(Schedule-10) ప్రకారం జరగనున్న విచారణకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (MLA Prakash Goud) తన అడ్వకేట్లతో విచారణకు హాజరయ్యారు. సుమారు గంట పాటు కొనసాగిన విచారణ కాసేపటి క్రితం ముగిసింది. తర్వాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య (Kale Yadaiah) స్పీకర్ ఎదుట హాజరుకానున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై(on petitions) స్పీకర్ ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి వచ్చే అక్టోబర్(October) 6 వరకు అమల్లో ఉంటాయని ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు (V. Narasimhacharya) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు కూడా స్పీకర్ ఎదుట హాజరుకానున్నారు.