ఒకవైపు ట్రంపు…మరోవైపు అతని….

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా….అగ్రరాజ్యం…విస్తీర్ణంలోనే కాదు, అపారమైన అవకాశాల్లోనూ అగ్రస్థానమే. ఉన్నత విద్యనభ్యసించాలన్నా, ఉద్యోగంలో బాగా సంపాదించాలన్నా ప్రపంచదేశాల ఆశావహుల చూపు అమెరికావైపే. అమెరికా అభివృద్ధిలో అగ్రస్థానం వలస మేధావులదే. ఇది కాదనలేని సత్యం. పాలకుల ముందు చూపుతో అట్టడుగు నుంచి అభివృద్ధి బాటన పట్టిన దేశాలూ ఉన్నాయి, అదే పాలకుల విజన్ లోపం, తొందరపాటు, దూకుడు చర్యలతో వెనకబడిపోయిన దేశాలూ ఉన్నాయి.

ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి పథంలో ముందువరసలో ఉన్న దేశం అమెరికా…అన్నిట్లో ముందున్న అమెరికాకి ఈమధ్య పాపం దిష్టి తగిలినట్లుంది. అందుకే చిత్ర విచిత్రమైన పాలకులు అధికారంలోకొచ్చి, తమ చిత్రాతి చిత్రమైన చేష్టలతో ప్రపంచదేశాలనే కాక, అమెరికన్లనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మతిమరుపుతో, కదలలేని స్థితిలో ఉన్న బైడెన్ మహాశయుణ్ణి కాదని రెండోసారి ట్రంపు కి అధికారం కట్టబెట్టిన అమెరికన్లు తమ పొరపాటు తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు.

మొదటి సారి పూర్తి నాలుగేళ్ళు అధికారంలో ఉన్న ట్రంప్ ఆ అనుభవంతో మెరుగైన పాలన అందిస్తాడని ఆశించీ ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆశలపై నీళ్ళు చల్లి, అనాలోచిత చర్యలతో అమెరికా అభివృద్ధిని వెనక్కి తీసుకుపోతున్నాడు. వాటి ఫలితంగాభవిష్యత్తులో తీవ్ర పరిణామాలను, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోందని ఎవరు హెచ్చరించినా లెక్క చేయడం లేదు. ఇప్పటికే ఆర్థికమాంధ్యం ముంగిట్లో దేశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నో రంగాలు కుదేలైనాయి. అయినా ట్రంప్ లో మాత్రం స్వీయ సమీక్ష శూన్యం.


విదేశాంగ విధానంలోనూ ట్రంప్ వ్యవహార శైలి ప్రపంచ దేశాలతో వైరమే తెచ్చిపెడుతోంది. అంతేకాక, తన హాస్యాస్పదమైన వ్యాఖ్యలతో పలు దేశాలలో పలుచనైపోవడం కూడా అమెరికన్లకు నచ్చడం లేదు.
తాను భారత్-పాక్ ల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ చెప్పుకోవడం, భారత్ ఆ విషయాన్ని ఎన్ని సార్లు ఖండించినా పట్టించుకోనట్టు ప్రవర్తించడం మళ్ళీ మళ్ళీ అదే పాతపాటను పాడడం ట్రంప్ కే చెల్లుతోంది.
ఇంకా ట్రంప్ పాలన ఎన్నిరోజులుందని అమెరికన్లే కాక ప్రపంచ దేశాలూ లెక్కబెట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఆ తర్వాతైనా సరైన పాలకుడు అధికారంలోకొచ్చి, సక్రమమైన పాలన అందించి అమెరికాని మళ్ళీ అగ్రపథాన, అందరికీ మిత్రదేశంగా నిలుపుతాడని ఆశ…

Leave a Reply