మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల టెండర్ వివాదం

మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల టెండర్ వివాదం
- టెండర్ రద్దుకు అధికార పార్టీ 5 గురు కౌన్సిలర్ల తోపాటు,
- ప్రతిపక్ష 3 గురు కౌన్సిలర్ల మెజారిటీ తీర్మానం
- ఎమ్మెల్యే సన్నిహితునికి రూ.15 కోట్ల కాంట్రాక్ట్ పనులు
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే ముసలం పుట్టింది.మున్సిపల్ ఎన్నికలకు ముందు మున్సిపాలిటీ కి మంజూరైన రూ.15 కోట్ల పనులకు సంబంధించి టెండర్లు పూర్తి చేసి , ఎన్నికల కు ముందస్తుగా ఆయా పనులకు సంబంధించిన శంకుస్థాపనలు సైతం ఎమ్మెల్యే స్వయంగా చేపట్టారు.
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.5 కొట్లతో బి టి, రూ.5 కోట్లతో సీసీ, రూ.2.50 కోట్లతో డా బి ఆర్ అంబేద్కర్, జ్యోతి రావ్ పూలే స్టడీ సెంటర్, రూ.1 కోటితో ప్రభుత్వ జూనియర్ కళాశాల, లైబ్రరీ, డంపింగ్ యార్డ్ లలో ప్రహరీ గోడల నిర్మాణం, రూ.1 కోటి 50 లక్షలతో మోత్కూర్ లో జంక్షన్ లు,పార్క్, మున్సిపాలిటీ సుందరీకరణ కోసం నిధులు కేటాయిస్తూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రతిపాదనలు చేశారు.

ఆయా పనులకు సింగిల్ టెండర్ ఒకే కాంట్రాక్టర్ (ఎమ్మెల్యే సన్నిహితుడైన వినోద్ రెడ్డి) కి ఎలా కట్టబెట్టారాని, కౌన్సిల్ ఆమోదం లేకుండా ఏకపక్షంగా అభివృద్ధి పనులు కొన్ని వార్డులలో చేపడితే, తమ వార్డులలో అభివృద్ధి పనులు ఎలా ముందుకు సాగుతాయని,తమను గెలిపించిన ప్రజలకు తాము ఏమి సమాధానం ఇవ్వాలని సోమవారం మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో రూ 15 కోట్ల పనులకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టగా అధికార పార్టీ కాంగ్రెస్ కి చెందిన కూర్మిళ్ల ప్రమీల,మొగుళ్ళ అనురాధ,బీసు శ్రీకాంత్, కారుపోతుల వెంకన్న,మెంట రమణ తో పాటు ప్రతిపక్ష బి ఆర్ ఎస్ కి చెందిన సుల్తాన్ స్వామి,కొండ శోభ , నల్ల మధు లు సదరు సింగిల్ టెండర్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం లో సంతకాలు చేయగా ,మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య లు టెండర్ రద్దు తీర్మానం పై సంతకాలు చేయకుండా సమావేశం నుండి బయటికి వెళ్లారు.

మెజారిటీ గా 8 మంది కౌన్సిలర్లు రూ.15 కోట్ల టెండర్ రద్దు కై తీర్మానం లో సంతకాలు చేయడంతో అట్టి తీర్మానాన్ని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిసింది.అధికార కాంగ్రెస్ కి చెందిన 8 మంది కౌన్సిలర్లు తీర్మానం విషయంలో తొలి బడ్జెట్ సమావేశం లోనే రెండు వర్గాలుగా వీగిపోవడంతో మున్సిపల్ ప్రజలు,అధికారులు ,నాయకులు సైతం ఆవాక్కయ్యారు.

రూ.15 కోట్ల పనుల టెండర్ రద్దు కోరుతూ ఇప్పటికె మున్సిపల్ సి డి ఎం ఏ లో ఫిర్యాదు తో పాటు తాజాగా కౌన్సిల్ తీర్మానం లో ముసలం పుట్టడంతో , మున్ముందు ఎలా అభివృద్ధి పనులు చేస్తారని,ఇప్పటికే శంకుస్థాపన చేసిన ఆయా అభివృద్ధి పనుల సంగతి ఏంటని మున్సిపల్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చొరవతో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చిన కౌన్సిలర్లు ఏకంగా టెండర్ రద్దు తీర్మానం పై మెజారిటీ కౌన్సిలర్లు సంతకాలు చేయడంతో ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
