officers | భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా…

officers | భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా…
- శివరాత్రి ఏర్పాట్లపై ఈఓ సీనా నాయక్ ప్రత్యేక తనిఖీలు..
officers | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ స్వయంగా పరిశీలించారు. శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, అన్ని విభాగాల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదిలోని దుర్గా ఘాట్‌ను ఈఓ సీనా నాయక్ పరిశీలించి, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు ఉండేలా పర్యవేక్షించారు.
నదిలో భద్రత, పరిశుభ్రతతో పాటు స్నాన ఘాట్‌ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాల పనితీరును పరిశీలించిన ఈఓ, అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు తక్షణ వైద్యం అందేలా వైద్య సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన మందులు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

డిజిటల్ విప్లవంలో భాగంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన సరికొత్త డిజిటల్ టెంపుల్ కియోస్క్ యంత్రాలను కూడా ఆయన పరిశీలించారు. కనకదుర్గ నగర్ ప్రవేశ ద్వారం, మహామండపం లిఫ్ట్ ఏరియా, ఆన్లైన్ కౌంటర్ల వద్ద ఈ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటి ద్వారా భక్తులు స్వయంగా దర్శనం, ప్రసాదం, ఇతర సేవల టిక్కెట్లను బుక్ చేసుకునేలా ఆన్‌లైన్ సేవల వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. కనకదుర్గ నగర్ వద్ద వాహనాల పార్కింగ్ క్రమబద్ధీకరణను ఈఓ స్వయంగా పర్యవేక్షిస్తూ, భక్తులు సులభంగా వాహనాలు పార్క్ చేసుకునేలా విభాగాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. అదేవిధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా అనధికారిక వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్యులకు త్వరితగతిన దర్శనం కలిగేలా ప్రోటోకాల్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. భక్తులే దేవుడని భావించి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని ఈఓ వి.కె. సీనా నాయక్ పేర్కొన్నారు. మొత్తంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిలో చేపట్టిన ఈ ఏర్పాట్లు భక్తుల హర్షాతిరేకానికి కారణమవుతుండగా, దేవస్థానం పాలనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
