AP | లక్ష గారెలు సమర్పయామీ.. కోడూరులో గంగానమ్మకు వినూత్న పూజలు

  • ప్రతి ఇంటి నుంచి 54గారెల సమర్పణ
  • హోరుగా.. జోరుగా గంగానమ్మ జాతర


ఆంధ్రప్రభ, కోడూరు (కృష్ణా జిల్లా) : కృష్ణా జిల్లా కోడూరులో గత నాలుగు రోజులుగా శ్రీ గంగానమ్మ తల్లి 50వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్న తరుణంలో.. గురువారం గంగానమ్మ తల్లికి లక్ష గారెల నైవేద్య సమర్ప‌ణకు మహిళా మాతలు బారులు తీరారు. ప్రతి ఇల్లాలు తన ఇంటిలో స్వయంగా వండివార్చిన 54 గారెలు కానీ, 108 గారెలు చొప్పున ఆలయానికి తీసుకువచ్చి గంగానమ్మకు నైవేద్యం సమర్పించాలని ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తెలిపారు.

మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా మహిళా భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగానమ్మ మూల మూర్తికి ఈ గారెలను సమర్పించారు. శ్రీ గంగానమ్మ తల్లి జాతర మహోత్సవం 1975లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది 50వ జాతర మహోత్సం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితుల సూచనల మేరకు గంగానమ్మ తల్లికి పాల పొంగళ్లు, గారెలు నైవేద్యం సమర్పిస్తే పసిడి పంటలతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, గ్రామాలు బాగుంటాయని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి లక్ష గారెలను సమర్పించారు.

ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు చేపట్టిన‌ కార్యక్రమానికి మహిళల నుండి అనూహ్య స్పందన లభించింది. భారీ సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం దేవస్థానం వద్ద పదివేల మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నెల 31న గంగమ్మ తల్లి ప్రధాన జాతర మహోత్సవం నిర్వహించగా, వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ఈనెల 1వ తేదీన అమ్మవారికి పాలపొంగళ్లు సమర్పించారు. కొనుగోలు చేసిన కొత్త గిన్నెల్లో పాల పొంగలి తయారు చేసి గంగానమ్మ తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు. కోడూరు గ్రామంలో వినూత్న రీతిలో గంగానమ్మ జాతర హోరెత్తుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *