observation | బైక్‌ల పై పరిశీలించిన రాష్ట్ర మంత్రులు

observation | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం జాతర ఏర్పాట్లను ఇవాళ ఉదయం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బైక్‌లపై పరిశీలించారు. మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర, ఇతర అధికారులు జాతర ఏర్పాట్లను పరిశీలించారు. మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కల్పించిన ఏర్పాట్లను స్వయంగా మంత్రులు పరిశీలించారు.

పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సారలమ్మ రాకతో మేడారానికి భక్తజనం పోటెత్తారు. జంపన్న వాగులో జలకళ… పుణ్యస్నానాలతో భక్తుల సందడి నెలకొంది. మేడారం అంతా ఎటు చూసినా భక్తులే కనబడుతున్నారు.

క్యూ లైన్లలో భక్తజనం కిక్కిరిసిపోతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తల్లుల దర్శనానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు సమ్మక్క రానున్న నేపధ్యంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. సమ్మక్క ప్రతిష్ఠ అనంతరం మరింత రద్దీకి అవకాశముంది. రద్దీని తట్టుకునేలా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. తల్లుల ఆగమనానికి సర్వం సిద్ధమైంది.

సాయంత్రం చిలకగుట్ట నుంచి సమ్మక్క తల్లి చేరుకోనున్నారు. సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తీసుకురానున్నారు. ఆయన వెంట మాల్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్, తదితరులున్నారు.

ఇప్పటికే చిలకగుట్ట నుంచి ఆలయ ప్రాంగణం వరకు రోప్ పార్టీ ట్రయల్ రన్ పూర్తి చేశారు. భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్స్, అగ్నిమాపక, వైద్య శాఖల బృందాలు అప్రమత్తమయ్యాయి.

