నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : సనాతన ధర్మానికి పుట్టి నిల్లు ఇందూరు గడ్డ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం సాయంత్రం వీర హనుమాన్ విజయయాత్ర ముగింపు సందర్భంగా రాజా రాజేంద్ర చౌరస్తా వద్ద వివధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, హిందూ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. హిందూ ధర్మానికి ఆంజనేయస్వామి ఒక రక్షణ కవచం.. ఆంజనేయ స్వామి అంటేనే… ఆత్మ విశ్వాసం.. ధైర్యం.. సాహసం.. ఏదైనా సాధించగలం అనే నమ్మకమని అన్నారు. జై భజరంగబలి అని నినదీస్తే ప్రతి హిందువు గుండె ఉప్పొంగుతుందన్నారు.
ఈ వేద భూమిలో.. ధర్మ భూమిలో కోటి దేవతల ఆశీర్వాదంతో భారతీయులుగా ఉన్నామంటే మన అదృష్టంగా భావించాలని అన్నారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఈ సనాతన ధర్మంలో హిందువుగా పుట్టడంమనది జన్మజన్మల సుకృతమని అన్నారు.
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రధాని మోదీ ఆశీర్వాదంతో ఫ్లై ఓవర్లు, పసుపు బోర్డు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని అన్నారు. వీరహనుమాన్ విజయ యాత్ర విజయవంతం చేసిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, వీహెచ్పి, వివిధ హిందూ సంఘాలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.