- హామీలన్నీ నెరవేరుస్తాం
- సంక్షేమ కార్యక్రమాలు ఆగవు
- మంత్రి సీతక్క
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ తదితరులు బుధవారం కామారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియాన్ని రూ.9 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. వృద్ధాశ్రమ నిర్మాణానికి కేటాయించిన రూ. 153 కోట్లలో భాగంగా రూ. 96 లక్షల విలువైన పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఆగదు అని అన్నారు. మహిళల సాధికారతకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పవర్ క్యాంటీన్లు-ఈవెంట్ మేనేజ్‌మెంట్-సోలార్ ప్లాంట్ల వంటి వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు అందిస్తున్నామని వెల్లడించారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమల్లో ఉందని, గత ప్రభుత్వంలో పెరిగిన యూరియా ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉన్నట్లు చెప్పారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల కొట్టాలు, కంపోస్ట్ గుంతలు, అంగన్‌వాడీలు, సీసీ రోడ్లు వంటి రూ.2,750 కోట్ల విలువైన పనులను ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ …మైనార్టీల సంక్షేమానికి మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్య వైద్య ఆరోగ్యానికి దోమకొండ లోని 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగిందన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం, విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గానికి ఒక 25 ఎకరాల్లో మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేపట్టామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కేటాయించామని తెలిపారు. కామారెడ్డి కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని గడిచిన 10 సంవత్సరాల్లో కామారెడ్డి పట్టణం చాలా వెనుక పడ్డదన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంచినీటి కొరత లేకుండా 200 కోట్లతో ఇంటింటికి నల్ల రాబోయే 20 సంవత్సరాల్లో నీటి కొరత లేకుండా చేస్తున్నామన్నారు. ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియాన్ని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని రాబోయే రోజుల్లో కామారెడ్డి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

