NZB | మీరు అసలు రైతులేనా..?
- సీతక్కను అడ్డుకున్న రైతులు
కామారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. భిక్కనూరులో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న సీతక్క, అనంతరం నిజామాబాద్ జిల్లా సిరికొండలోని ఎవరెస్ట్ శిఖర అధిరోహిత మాలావత్ పూర్ణను పరామర్శించేందుకు బయలుదేరారు.
ఈ ప్రయాణంలో, రామారెడ్డి మండల కేంద్రంలో రైతులు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. సన్నరకం వరి ధాన్యానికి బోనస్ అందించాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన, ఆగ్రహ స్వరాలు పెరగడంతో, మంత్రి సీతక్కకు అసహనం కలిగి, “అసలు మీరు రైతులేనా?” అని ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

