Nutritional | అంగన్వాడీల పనితీరుపై ఎమ్మెల్యే సమీక్ష

Nutritional | అంగన్వాడీల పనితీరుపై ఎమ్మెల్యే సమీక్ష
- విధులలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని
- అంగన్వాడి ఆయాలు, టీచర్లు ప్రతిరోజూ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి
- సూపర్వైజర్లు, సీడీపీఓలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ కఠిన ఆదేశాలు
Nutritional | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట డివిజన్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల పనితీరుపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అంగన్వాడి సూపర్వైజర్లు, సీడీపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలు, పోషకాహార పంపిణీ, ప్రీ–స్కూల్ విద్య అమలు, కేంద్రాల నిర్వహణ వంటి అంశాలపై ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి రోజు సూపర్వైజర్లు, సీడీపీఓలు అంగన్వాడి కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విధులలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడి ఆయాలు, టీచర్లు ప్రతిరోజూ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అంగన్వాడి కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, సేవల నాణ్యత మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి కేంద్రంలో పిల్లల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య తనిఖీలు క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూపర్వైజర్లు, సీడీపీఓలకు ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓలు, అంగన్వాడి సూపర్వైజర్లు పాల్గొన్నారు.
