NTR| పత్తికొండ, ఆంధ్రప్రభ: తెలుగు జాతి గర్వానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికెర మండలం ఏడవలి గ్రామంలో శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కా రెడ్డి పాల్గొని భావోద్వేగపూర్వకంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ఎన్టీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, “ఒక ఉద్యమం.. ఒక యుగం.. ఒక ప్రజా హృదయం” అంటూ ఆయన సేవలను స్మరించారు. పేద ప్రజల కోసం ఆవిర్భవించిన నాయకుడిగా, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యుగపురుషుడిగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు.

పేదల ఆకలి తీర్చే పాలన, ప్రజలకు ఆత్మగౌరవం కల్పించే ప్రభుత్వ విధానాలు ఎన్టీఆర్ యుగంలోనే ప్రజలు అనుభవించారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త కర్తవ్యమని పేర్కొన్నారు. పార్టీ అడుగులు ఎన్టీఆర్ చూపిన దారిలోనే ముందుకు సాగుతున్నాయని నాయకులు తెలిపారు.
విగ్రహావిష్కరణ వేడుకతో ఏడవలి గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు, అభిమానులు భారీగా హాజరై ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించారు. “జై ఎన్టీఆర్” నినాదాలతో గ్రామం అంతట మార్మోగింది. ఎన్టీఆర్ విగ్రహం స్థాపన రాబోయే తరాలకు ఆయన సేవలు, త్యాగాలు, విలువలు చెరగని స్ఫూర్తిగా నిలుస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

