చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం…

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం…
కోటబొమ్మాళి(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : చేనేత కార్మికులపై విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా మగ్గం నేతన్న లకు నెలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గం(పవర్ లూమ్) నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం కోటబొమ్మాలి హడ్కో కాలనీలో ప్రజా సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి, జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ తో కలసి గడపగడపకు వెళ్లి సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లు పారదర్శకంగా అందే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేసి ప్రజల నుండి సూపర్ హిట్ సంతృప్తి స్థాయి వచ్చిందన్నారు.
రానున్న రోజుల్లో గ్రామాలలో మట్టి రోడ్లు లేని సిమెంటు రోడ్లు నిర్మించాలన్న తపనతో అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామన్నారు. కొత్తపేట అభివృద్ధి మాదిరిగా కోటబొమ్మలి లో కోటి రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, 60 లక్ష రూపాయలతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం బ్యాంకు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఒకే ఒక డిగ్రీ కళాశాల కోటబొమ్మాలి లో మంజూరు చేసి కోటబొమ్మాలి గౌరవాన్ని పెంపొందించామన్నారు. కోటబొమ్మాలి, టెక్కలి, సంతబొమ్మాలి మండలం లక్ష్మీపురం వద్ద నిరుపేదలకు పంపిణీ చేసేందుకు 95 శాతం నిర్మాణం చేపట్టిన హూద్ హూద్ ఇళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తిరిగి తమ ప్రభుత్వం రూ.8 కోట్లను మంజూరు చేసి టెండర్లను పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆరు మాసాల్లో హూద్ హూద్ ఇళ్లను పూర్తిచేసి అర్హత కలిగిన నిరుపేదలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు మంజూరు కాగా నియోజవర్గానికి రూ.620 కోట్లు మంజూచేసి రెండు సంవత్సరాలలో ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించే బృహత్కర కార్యక్రమం చేపడతున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు సమాంతర జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ , గూగుల్ సెంటర్ ఏర్పాటు వల్ల లక్షల 50 మందికి ఉపాధి లభించనునట్టు తెలిపారు.
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు 17 వేల కోట్లు సహకారం అందించి ప్రభుత్వం ఆదుకున్నట్లు తెలిపారు. 3 వేల కోట్లు కేటాయించి వచ్చే రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని పనులు పరుగులు పెట్టిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో కాలయాపన చేసిందని అన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించి, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని ఐదు కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్ష, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం నెరవేరనందన్నారు. మూలపేట పోర్టుకు భూములతో పాటు ఆ ప్రాంత మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉప్పు భూములు అవసరాన్ని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో ఇటీవల 380 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు వివరించారు.
పోర్టుకు నాలుగు లైన్ల రహదారి, రైల్వే మార్గం నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామ ప్రజలకు పునరావాసం కింద నౌపడ వద్ద నిర్మించిన కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారు పండుగ ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించి కొత్తపేట నుండి కోటబొమ్మలి వరకు జిల్లా మినరల్ డెవలప్మెంట్ నిధులతో రహదారులు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, జిల్లాలో 3లక్షల 60 వేల మంది పింఛన్దారులకు రూ.130 కోట్లు, టెక్కలి నియోజకవర్గం లో 41 వేల మందికి రూ.17.7 కోట్లు, కోటబొమ్మాలిలో వేయి మంది లబ్ధిదారులకు రూ.43 లక్షలు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం సిబ్బంది ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక పింఛన్లు పంపిణీ పారదర్శకంగా పంపిణీ జరగాలని, సాంకేతిక సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ప్రజలు స్వచ్ఛత పాటించి పరిసరాల పరిశుభ్రతను పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం కృష్ణమూర్తి, మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు కింజరాపు హరిప్రసాద్, కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు బోయిన గోవింద రాజులు, కోటబొమ్మాళి పీ ఏ సి ఎస్ అధ్యక్షులు వెలమల విజయ లక్ష్మీ, ఎంపిడిఓ ఫణీంద్ర కుమార్, తదితరులు, పాల్గొన్నారు.
