ఏపీకే రోల్ మోడల్ గా ఎన్టీఆర్ జిల్లా..

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాను పేదరికం లేని జిల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లాలోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. అంతే కాదు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని… ప్రతి ఒక్కరూ ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాంబర్ ఆఫ్ రియాల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి విశిష్ట సేవా పురస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి వందమంది ప్రముఖులకు విశిష్ట సేవ పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు పీ4 విధానంతో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఆదర్శంగా తీసుకుని తను కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వందమంది మార్గదర్శకులు 1000 కుటుంబాలకు ఆదర్శంగా నిలబడటంతో పాటు వారిని దత్తత తీసుకొని వారి కుటుంబ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్వాక్రా సంఘాలలోని మహిళలను కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో స్వయం ఉపాధి రంగంలో నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు.
విజయవాడలో కొండలన్నీ పచ్చదనంతో ఉండటానికి కారణం మాజీ మేయర్ జంధ్యాల శంకర్ ఆనాడు కొండలపై విత్తనాలు చల్లించడమని గుర్తు చేశారు. ప్రముఖ విద్యావేత్త ఎం సీ దాస్ తన ప్రసంగాల ద్వారా ఎంతో మందిలో చైతన్యం నింపారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అత్తలూరి నాగమల్లేశ్వరరావు అధ్యక్షుడు సారేపల్లి శరత్, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బొప్పన భవ కుమార్, త్రిశూల్ బసవేశ్వర రావు, డాక్టర్ సంకె విశ్వనాథ్, ఎంసీదాస్, యాంకర్ ఉదయభాను, ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ, జీవి రామారావు, సినీ నటుడు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
