నైజీరియాలో అథ్లెట్లను తీసుకెళ్తున్న బస్సు వంతెన పైనుంచి పడిపోవడంతో 21 మంది అథ్లెట్లు మరణించారు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
ఆ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలా మంది అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు ఆ బస్సులో ఉన్నారు. వారందరూ ఓగున్ రాష్ట్రంలో జరిగిన క్రీడా ఉత్సవంలో పాల్గొన్న తర్వాత కానో రాష్ట్రం వైపు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో బస్సు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. బస్సులోని ప్రయాణికులను వెంటనే అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. బస్సు వంతెనపై నుంచి కింద పడిపోయినప్పుడు రోడ్డుపై ఇతర వాహనాలు లేవని.. డ్రైవర్ అలసట, అతివేగం మాత్రమే కారణమని తెలిసింది. ఈ ప్రమాదం రాత్రిపూట జరిగింది. డ్రైవర్ విరామం తీసుకోకుండా వాహనాన్ని నడుపుతున్నాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.