రాయల  చెరువు గండిపై కొత్త కథ   

ఎలుకలు.. కాదు  పందికొక్కులు

( ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి)

ఇది విన్నారా. ఈ వింతను కన్నారా. ఔను ఈ వింత అసాధారణం కాదు. అసాధ్యం. ఎందుకంటే ఓ చెరువుపై ఎలుకలు దండయాత్ర జరిపాయి. నేలను తవ్వేశాయి. బొరియలు పెట్టేశాయి.  బొగడను సృష్టించాయి. ఈ బొగడ పెద్దదైంది. ఇంకేముందీ   చెరువుకు గండి పడింది. ఎనిమిది అడుగుల ఎత్తులో సునామీ ఆరు ఊళ్లపైకి దూకింది. జనం  ప్రాణాలు దక్కాయి. మూగజీవాలు చచ్చిపోయాయి. పొలాల్లో రాళ్లు ప్రవహించాయి. ఇసుక మేటలు తిష్టవేశాయి. కళ్లెదుటే జలవిలయ తాండవాన్ని తట్టుకోలేక జనం కన్నీరు మున్నీరయ్యారు.  ఇదీ..తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం , ఒళ్లూరు రాయల చెరువు గండికి అసలు సిసలు ఎలుకల కథ. ఇది కూడా తప్పేనంట. ఎందుకంటే ఇరిగేషన్  అధికారులను ఓ డౌటనుమానం పీడిస్తోంది. ఈ చెరువుకు   గండి కొట్టింది,   ఎలుకలు లేదా పందికొక్కులు  కావొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్లుగా చెరువు కట్టపై దాడి చేయని సోకాల్డ్ ఎలుకలు.. లేదా    పందికొక్కులు ఈ సారి ఎందుకు ఫైర్ అయ్యాయి. నిజంగా ఆ మూగ జీవాలే చెరువు కట్టను తెంచాయా? లేక.. రియల్ పందికొక్కులు ఈ కథను తెరమీదకు తెచ్చాయా? ఔను.. గత ప్రభుత్వం హయాంలో ఓ వైసీపీ నేత ఈ చెరువుపై కన్నేశాడు. కానీ ఆయనకు ఫలితం దక్కలేదు. తాజాగా ఇప్పుడు ఓ పసుపు ధీరుడు చెరువుపై ఆశపెంచుకున్నాడని.. ఏది ఏమైనా.. ఈ రాయల చెరువుకు గండి వెనుక ఓ మిస్టరీ ఈ ఆరుగ్రామాల  జనాన్ని కలవరపెడుతోంది. 

అకస్మిక సునామీ

అది  నవంబర్ 6, గురువారం  అ్చప్పుడప్పుడే పొద్దు పొడుస్తోంది. కోళ్లు కూస్తున్నాయి. కాకులు కావుకావుమంటున్నాయి. ఇళ్లల్లోని జనం ఇప్పుడిప్పుడే  నిద్రలేచేస్తున్నారు. అంతలోనే  ఒళ్లూరు రాయల చెరువుకు గండి పడింది. చెరువుకట్ట తెగిపోయింది.  జలవిలయం విరుచుకుపడింది.  క్షణాల్లోనే కళత్తూరు, రాజుల కండ్రిగ, పూడి, పాతపాలెం గ్రామాలపై  జల సునామీ దూసుకొచ్చింది.  వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. అంతే జనం ఉలిక్కిపడ్డారు.  కళ్లముందే పంటపొలాలు సముద్రంలా మారిపోయాయి. ఇళ్లల్లో  ధాన్యం తడిచిపోయింది.  వాహనాలు, పశువులు కొట్టు-కుపోయాయి. ఇక ప్రాణాల అరచేతిలో పెట్టుకుని  జనం  మేడలపైకి ఎక్కారు.  అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు.  

ఊహించని విపత్తు

ఇప్పటికే వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఒళ్లూరు రాయల చెరువు నిండుకుండలా మారింది. చెరువు కట్ట బలహీనంగా ఉంది. ఈ విషయాన్ని  గ్రామస్తులు అనేకసార్లు  అధికారులకు ఏకరవు పెట్టారు.  ఎలాంటి చర్యలూ  తీసుకోలేదు. భారీ  వర్షం స్థితిని గమనించిన  అధికారులు కనీసం గ్రామస్తులను హెచ్చరించలేదు.  వాస్తవానికి  రాయల చెరువు కింద – సుమారు 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది.  చెరువు నిల్వ  సామర్థం 0.75 టీ-ఎంసీలు. 1965 లో 750 మీటర్ల పొడవుతో రెండు కొండలను కలిపేలా చెరువు కట్టను నిర్మించారు. సుమారు 10 మీటర్ల లోతు, 20 ఎకరాల విస్తీర్ణంలో   ఈ చెరువు  నీటి సామర్థం 88.29 మిలియన్‌ క్యూబిక్‌ అడుగులు. ఇక అప్పుడప్పుడు చిన్న చిన్న బోగడలు పడి నీరు పోయేది. తాత్కాలికంగా మట్టి మూటలు పేర్చి అడ్డుకట్టు వేస్తుండేవారు.  2014లో నీరు చెట్టు- పథకంలో కట్టకు మరమత్తులు చేపట్టారు. ఆ తరువాత పాలకులు చెరువును పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కట్ట బాగా బహీనపడి, పర్యవేక్షణ కరువైంది.   

కళ్ల ముందే  నష్టం

కళత్తూరు, హరిజనవాడ ప్రాంతాల్లో నీరు పరవళ్లు తొక్కింది. సుమారు ఎనిమిది అడుగుల మేర నీరు ఎగిసిపడింది. ఆరు  గ్రామాలను చుట్టేసింది. పలు మూగజీవాలు,   కోళ్లు, కుక్కలు, బైకులు ,ఆటోలు, ట్రాక్టర్లు, పశువులు కొట్టు-కు పోయాయి. కళ్లముందే పశువులు, మేకలు బొమ్మల్లా కొట్టు-కొని పోతుంటే.. నిస్సహాయ స్థితిలో జనం కన్నీళ్లు పెట్టుకున్నారు.   ఒళ్లూరు, పాతపాలెం, కళత్తూరు, ఎంఏ రాజుల కండ్రిగ, మహదేవపురం, కాట్రపల్లి గ్రామాల్లో    రెండువేల ఎకరాల్లో  రాళ్లు, ఇసుక మేటలు ఏర్పడ్డాయి.

చెరువు  గండి పెద్ద మిస్టరీ

ఇంతకీ ఈ చెరువు కట్ట ఎందుకు తెగిపోయింది? విభిన్న కథనాలతో మిస్టరీని తలపిస్తున్నాయి.  చెరువు కట్టకు ఎలుకలు, పందికొక్కులు రంధ్రాలు వేశాయి.  ఇంకేముందీ  బొగడా పడింది. ఇది  కట్ట తెగే వరకు పెరిగింది. ఇదీ నీటిపారుదల శాఖ చెబుతున్న బ్యాగ్ పైపర్ కథ. అకస్మాత్తుగా .. చెరువు కట్ట తెగిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇది సహజ ప్రమాదమా?  లేక ఆఫీసర్ల  నిర్లక్ష్య ఫలితమా?  అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీ-వల చెరువు మరమ్మతులకు నిధులు కేటాయించారు.  పనులను మమ అనిపించారు.  కానీ  గండి పడింది,  పకృతి విపత్తు  కాదు..  ఎవరో గండి కొట్టారు. ఈ చెరువును కబ్జా చేయాలని ఈ పని చేశారు,  అని ఆరు గ్రామాల ప్రజలు అనుమానిస్తున్నారు.

చలించిన ఎంపీ..

వరద బాధిత గ్రామాల కోసం ఎంపీ గురుమూర్తి వెంటనే స్పందించి రూ.20 లక్షల ఎంపీ నిధులను మంజూరు చేశారు. తిరుపతి నుంచి ఆహార పదార్థాలు, తాగునీటి బాటిళ్లతో సహాయక లారీలు బయలుదేరాయి. ఎవరూ ఆకలితో ఉండకూడదు, ప్రతి బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకోండి అని ఎంపీ సూచించారు.

Leave a Reply