ఆనందం వ్యక్తం చేసిన మహిళామణులు
లబ్ధిదారులతో ముచ్చటించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh State Government) ప్రవేశపెట్టిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం (Stree Shakti Free Bus Travel Scheme) విజయవంతంగా అమలవుతోందని, స్త్రీశక్తితో మహిళా సాధికారతకు సరికొత్త ఉత్తేజం వచ్చిందని, లబ్ధిదారులు ఆనందంతో చెబుతున్న మాటలే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (Collector Dr. G.Lakshmi) అన్నారు. ఆదివారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (Nehru Bus Station)ను కలెక్టర్ సందర్శించి వివిధ మార్గాల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సుల్లోని మహిళా ప్రయాణికుల (Women Passengers)తో మాట్లాడారు.

మీరు ఎక్కడికి వెళ్తున్నారు.. పథకం ఎలా ఉంది.. ఏమైనా సమస్యలున్నాయా.. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అంటూ మాట కలిపారు. విద్యార్థులతోనూ ముచ్చటించారు. పథకం చాలా బాగుందని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవంటూ ముఖంపై చిరునవ్వుతో బదులిచ్చారు. ఏవైనా ఇబ్బందులుంటే 1100 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేసి చెప్పొచ్చని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర అవకాశాల కోసం ఆర్థిక భారం లేకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ సాధికారతతో సరికొత్త మైలురాళ్లను చేరుకుంటున్నారన్నారు. విద్య అనేది మనిషి జీవితానికి వెలుగునిస్తుందని.. బాలికా విద్యను కూడా ప్రోత్సహించేందుకు ఈ పథకం దోహదం చేస్తోందన్నారు. ప్రయాణ ఖర్చుల ఊసే లేకుండా తమ పనులను చక్కదిద్దుకుంటూ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములవుతున్నారని.. ఇంత మంచి పథకం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ధన్యవాదాలు తెలియజేశారని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.