New CEO | ఐసిసి సీఈవో గా సంజోగ్ గుప్తా …

ముంబ‌యి – అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC ) నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి CEO)గా సంజోగ్ గుప్తా (Sanjog gupta) నియమితులయ్యారు. దుబాయ్‌లోని (dubai ) ఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేడు బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన ఏడో వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ క్రికెట్‌ను సరికొత్త భవిష్యత్తు వైపు నడిపించేందుకు సంజోగ్ గుప్తాకు స్వాగతం పలుకుతున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ నియామకం కోసం ఐసీసీ మార్చిలో ప్రపంచవ్యాప్త ప్రక్రియను ప్రారంభించింది. నామినేషన్స్ కమిటీ పలువురు అభ్యర్థులను పరిశీలించి, చివరికి సంజోగ్ గుప్తా పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమోదం తెలపగా, ఐసీసీ బోర్డు దీనిని ధ్రువీకరించింది. “సంజోగ్ గుప్తా నియామకాన్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. క్రీడా వ్యూహాలు, వాణిజ్యీకరణలో ఆయనకున్న అపార అనుభవం ఐసీసీకి అమూల్యమైంది. రాబోయే సంవత్సరాల్లో క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే మా ఆశయానికి ఆయన అనుభవం ఎంతగానో దోహదపడుతుంది” అని జైషా తెలిపారు.

తన నియామకంపై సంజోగ్ గుప్తా స్పందిస్తూ… “ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది అభిమానులున్న క్రికెట్‌కు సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం, ఆధునిక టెక్నాలజీని వినియోగించడం ద్వారా క్రీడను మరింత ముందుకు తీసుకెళ్తాను” అని అన్నారు.

సంజోగ్ గుప్తా గతంలో జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి, 2010లో స్టార్ ఇండియాలో చేరారు. అక్కడ స్పోర్ట్స్ విభాగానికి హెడ్‌గా ఎదిగారు. ఐసీసీ ఈవెంట్లు, ఐపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలతో పాటు పీకేఎల్, ఐఎస్ఎల్ వంటి దేశీయ లీగ్‌ల విజయవంతంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Leave a Reply