నెల్లూరు .. ఆంధ్రప్రభ,: భూమి కంటే ఎక్కువుగా మన భారం మోసేది అమ్మ అని.. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. జిల్లాలోని వీఆర్ హైస్కూల్ (VR school ) ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను( teachers ) చూస్తే దేవుళ్లు(god) గుర్తొస్తారని తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ పాఠశాల ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డానని… ఇప్పుడు చూసి అసూయపడుతున్నట్లు చమత్కరించారు. చాలా చక్కగా మంత్రి నారాయణ (Minister Narayana) వీఆర్ హైస్కూల్‌ను తీర్చిదిద్దారని అభినందించారు. నెల్లూరులోనే ఇలాంటి అత్యాధునిక స్కూల్ ఎక్కడా లేదని... అందుకే ఇక్కడ చేరామని పిల్లలు చెబుతున్నారన్నారు.

రాబోయేరోజుల్లో ఏపీ విద్యావ్యవస్థను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్ దేశంలోనే నంబర్ వన్ మోడల్ స్కూల్ గా అవతరిస్తుందన్నారు. ఈ పాఠశాలను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి మంత్రి నారాయణ రూపకల్పన చేశారు, నెల్లూరు నగరంలోని వెంకటగిరి రాజా ఉన్నత పాఠశాల 150 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ పాఠశాల నెల్లూరుకు గర్వకారణం. మంత్రి నారాయణ నాయకత్వంలో వీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల తిరిగి ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. ఇక్కడ చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. దివంగత బెజవాడ గోపాల్ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పాఠశాల పూర్వవిద్యార్థులే. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులోనూ ఇదే రీతిలో స్కూలును అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే అయిదేళ్లలో వీఆర్ హైస్కూలు తరహాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో లీప్ మోడల్ స్కూళ్లను అభివృద్ధిచేస్తాం అని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు
దురదృష్టవశాత్తు చారిత్రాత్మక వీఆర్ పాఠశాలను గత ప్రభుత్వ హయాంలో మూసివేశారు. తాను చదివిన పాఠశాలను మంత్రి నారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరిగి ప్రారంభించారు. నిరుపేద పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు వీలుగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఒక సంవత్సరంలోనే విద్యారంగంలో గణనీయమైన మార్పులు తెచ్చాం. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి. విఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఆధునిక తరగతి గదులు, రక్షిత తాగునీటి సౌకర్యం, స్మార్ట్ బోర్డులు తదితర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఉపాధ్యాయ కొరత లేకుండా తగిన సంఖ్యలో టీచర్లను నియమించారు. 2014-..19 నడుమ మంత్రి నారాయణ నెల్లూరులో ₹5,250 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేశారు. 2024 ఎన్నికల సమయంలో ఆయన 84,000 ఇళ్లను స్వయంగా సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు, అని మంత్రి లోకేష్ ప్రశంసించారు.
విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించి, ఇటీవలే విజయవంతంగా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాం, త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టబోతున్నాం. టీచర్ ట్రాన్సఫర్ యాక్ట్ ద్వారా అత్యంత పారదర్శకంగా 67,732 మంది ఉపాధ్యాయుల బదిలీలు, 4,477 మందికి పదోన్నతులు కల్పించాం. రాష్ట్రవ్యాప్తంగా మెగా పిటిఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ విద్యాప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. ఈనెల 10వతేదీన మెగా పిటిఎం నిర్వహిస్తున్నాం. విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు నైతిక విద్యపై పుస్తకాలు, వీడియోలు తయారుచేసి విద్యార్థులకు అందిస్తున్నాం. తరగతి గది నుంచే మహిళలను గౌరవించే పాఠ్యాంశాల బోధనతోపాటు, వారికి పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణం కల్పిస్తున్నాం. పాఠ్యాంశాల్లో ఇంటిపనులు స్త్రీ,పురుషులకు సమానంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి, ఆరోజున యోగా, పిట్ నెట్, క్రీడలు వంటి విద్యేతర కార్యక్రమాలపై దృష్టిసారించేలా చర్యల చేపట్టాం. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలను అమలు చేస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సుమారు లక్ష మంది విద్యార్థులకు నీట్/జెఇఇ పరీక్షలకు మెటీరియల్ తోపాటు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలో రాబోయే నాలుగేళ్లలో నూరుశాతం అక్షరాస్యతను సాధించడానికి ప్రాజెక్టు అక్షర ఆంధ్రను ప్రారంభించాం. కెజి నుంచి పిజి వరకు విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాం. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం ఉపాధ్యాయులు, అధికారుల సమిష్టి కృషితో, పట్టుదలతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.

క్రికెట్, వాలీబాల్ ఆడిన లోకేష్ ..
ముందుగా క్లాస్ రూంలను సందర్శించి డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించారు మంత్రి. ప్రతీ క్లాస్‌లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో యువనేతతో ఫోటోలు దిగేందుకు చిన్నారులు ఆసక్తి చూపారు. దీంతో దాదాపు అర్ధగంట పాటు విద్యార్థులతో సరదాగా గడిపారు విద్యాశాఖా మంత్రి. ఆపై స్కూల్ లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు. . అలాగే క్రీడా మైదానాన్ని పరిశీలించిన మంత్రి లోకేష్.. క్రికెట్, వాలీబాల్ ఆడి చిన్నారుల్లో జోష్ నింపారు.
వేమిరెడ్డి దత్తత స్కూల్ కు శంకుస్థాపన..
గత ప్రభుత్వం నిర్వాకంతో ఐదేళ్లుగా మూతబడిన వీఆర్ హైస్కూల్‌ను ఇక్కడే చదువుకున్న మంత్రి నారాయణ చొరవతో దాదాపు రూ.15 కోట్లతో పాఠశాలకు పునర్వైభవం తీసుకొచ్చారు. అంతేకాకుండా 1050 మంది నిరుపేద విద్యార్థులను ఈ స్కూల్లో చేర్చుకున్నారు. వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకొన్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దత్తత తీసుకొన్న మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు కూడా మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, ఎన్ఎండి ఫరూక్, పొంగూరు నారాయణ, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.