Nekarikallu | ముక్కోటి ఏకాదశి వేడుకలు..

Nekarikallu | ముక్కోటి ఏకాదశి వేడుకలు..
Nekarikallu | నకరికల్లు, ఆంధ్రప్రభ : గ్రామంలోని మునసబు బజార్లో వెలసి ఉన్న పురాతన శ్రీ సీత కోదండ రామస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ ఏడాది వేడుకలు మరిన్ని విశేషాలతో భక్తులను కట్టిపడేశాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. “గోవిందా.. రామా..” స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే.. మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఉత్సవ విగ్రహాలు. జూలకంటి నర్సింహారావు విజయలక్ష్మి దంపతులచే నూతనంగా బహుకరించిన సీతారామ లక్ష్మణ హనుమానుల ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఈ నూతన విగ్రహాలను రంగురంగుల పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. మంగళవాయిద్యాలు, భజన కీర్తనల మధ్య ఊరేగింపు సాగింది. గ్రామస్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు ఇచ్చి, నైవేద్యాలు సమర్పించుకున్నారు. నూతన విగ్రహాల కళను చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ.. గ్రామస్తుల సహకారంతో నూతన ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని, భక్తులందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
