యడ్లపాడులో జాతీయ స్థాయి నాటకోత్సవాలు..

యడ్లపాడులో జాతీయ స్థాయి నాటకోత్సవాలు..

యడ్లపాడు, ఆంధ్రప్రభ : తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి కామ్రెడ్‌ పుచ్చలపుల్లి సుందరయ్య అని కమ్యూనిస్టు నాయకులు పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 23వ జాతీయస్థాయి నాటిక పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభం అయ్యాయి. ముందుగా సుందరయ్య చిత్రపటానికి కమ్యూనిస్టులు, పరిషత్‌ నిర్వహకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తొలిరోజు ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. ముత్తవరపు సురేష్‌బాబు, అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సీపీఎం నాయకులు వై.రాధాకష్ణ, ప్రజాశక్తి సంపాదకులు ఎంవీఎస్‌ శర్మ, సినీ నటులు ఉప్పులూరి సుబ్బరాయశర్మ, తెలుగు అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకష్ణ ముత్తవరపు రామారావు, నూతలపాటి కాళిదాసు, కష్ణయ్య, ముత్తవరపు పద్మారావు, జరుగుల శంకర్రావు, వివిధ కళా పరిషత్‌ల ప్రముఖులు సుందరయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నాటక బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. ప్రతిరోజూ సాయంత్రం నాటికల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాటకోత్సవాలు నాటకరంగ అభివృద్ధికి దోహదపడటంతో పాటు యువ కళాకారులకు మంచి వేదికగా నిలుస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మూడు రోజుల పాటు యడ్లపాడు గ్రామం కళల సందడితో కళకళలాడనుంది.

శుక్రవారం ప్రదర్శించే నాటికలు:

దీపం కింద చీకటి..నాటిక :
దేశం కోసం ఆస్తిని త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడి కొడుకు రాముడు బ్రెయిన్‌ ట్యూమర్‌తో మృత్యువుకు చేరువవ్వగా,నిరుపేద తండ్రి పాత్రుడు తన కొడుకును రక్షించుకోవడానికి వ్యవస్థలోని లోపాన్నే ఆయుధంగా మార్చుకున్న కథయే దీపం కింద చీకటి నాటిక. నేరస్తుల విలాసాల కోసం లక్షలు ఖర్చు చేసే ప్రభుత్వం,సామాన్యుడి ప్రాణాన్ని గాలికొదిలేయడాన్ని నిరసిస్తూ.. చట్టంలోని లొసుగును తన స్వార్థం కోసం వాడుకుని కొడుకును ఎలా బతికించుకున్నాడనేదే ఈ ఇతివృత్తం. అన్యాయమైన వ్యవస్థలో వెలుగులు పంచే దీపాల కింద పేరుకుపోయిన సామాజిక చీకట్లను ఈ నాటిక కళ్లకు కడుతుంది. కళానికేతన్‌(వీరన్నపాలెం)వారి దీపంకింద చీకటి నాటికను శ్రీ అగస్త్య రచించగా వైబీ చౌదరి దర్శకత్వం వహించారు.

(అ)సత్యం నాటిక.:
మనిషి హృదయంలో స్వార్థం, భయమే సత్యాసత్యాల మధ్య గీతను చెరిపేస్తుందని, కంటికి కనిపించేదంతా నిజం కాదని అ‘సత్యం నాటిక చాటిచెబుతుంది. ఒక యదార్థం వల్ల కీడు జరిగితే అది అసత్యంతో సమానమని, ఒక అబద్ధం వల్ల మేలు జరిగితే అది సత్యం కన్నా మిన్న అని విశ్లేషిస్తూ సాగే భావనాత్మక ప్రయాణమిది. ప్రతి మనిషిలోని దైవత్వాన్ని, రాక్షసత్వాన్ని ప్రశ్నిస్తూ.. క్లిష్ట పరిస్థితుల్లో మనిషి తీసుకునే నిర్ణయాలే మనిషి జీవితానికి మేలుకీళ్లను నిర్ణయిస్తాయని ఈ ఇతివృత్తం నిరూపిస్తుంది. విశాఖపట్నం (చైతన్య కళాస్రవంతి) వారి (అ)సత్యం నాటిక శ్రీసుధ మోదుగు కథకు పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరణ చేయగా, పి బాలాజీ నాయక్‌ దర్శకత్వం వహించారు.

కన్నీటికి విలువెంత..? నాటిక :
మాతృత్వాన్ని వ్యాపారంగా మార్చిన వైద్యురాలి పై స్త్రీ శక్తి ఒక్కటై తిరుగుబాటు చేసే కథనమే కన్నీటికి విలువెంత నాటిక. ధనవ్యామోహంలో పడిన డాక్టర్‌ సరోజినీ దేవి, ప్రసవ సమయంలో ధనికురాలి బిడ్డ చనిపోవడంతో తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పేదరాలైన సీతాలు బిడ్డను మార్పిడి చేసే నీచమైన పనికి ఒడిగడుతుంది. ఈ కుట్రను గమనించిన నర్సు నందిని ద్వారా నిజం తెలుసుకున్న సితాలు, మాధవి ఒక్కటయ్యి.. వైద్యురాలిపై తిరుగుబాటు చేస్తారు. కన్నీటిని కూడా కాసులతో కొలిచే వ్యవస్థపై పోరాడి, అన్యాయానికి ఒడిగట్టిన డాక్టర్‌ను న్యాయస్థానానికి ఈడ్వడంతో ఈ సామాజిక నాటిక ముగుస్తుంది. బీవీకే క్రియేషన్స్‌(కాకినాడ) వారి కన్నీటికి విలువెంత..? నాటిక డి కామేశ్వరి మూలకథకు డి ఉమాశంకర్‌ నాటకీకరణ చేయగా, డి వినయ్‌ దర్శకత్వం వహించారు.

Leave a Reply