AP | జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కంతో సగటు బతుకులో వెలుగులు … ప‌వ‌న్ క‌ళ్యాణ్

(ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో ) : జాతీయ ఉపాధి హామీ పథకం సగటు బతుకు తెరువులేక ఇబ్బంది పడుతున్న కూలీల కోసం ప్రవేశపెట్టిన పథకం. అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి గత ప్రభుత్వంలో ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల (ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈపథకంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.930కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల సేద్యపు నీటికుంటలకు శంకుస్థాపన చేశారు. ఓర్వకల్లు మండలం, పూడిచర్లలో రైతు సూర రాజన్నకు చెందిన 1.30 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేయనున్న సేద్యపు కుంటకు భూమిపూజ చేశారు. ఉపాధి కూలీలతో కలసి స్వయంగా గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. అనంతరం పూడిచర్ల గ్రామంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగు పరిచిందన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మన రాష్ట్రంలో 57.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకు తమ సొంత గ్రామాల్లో పనులు కల్పించామన్నారు. ఇప్పటి వరకు రూ.23.52 కోట్ల పనులను అందించి 4.20 లక్షల కుటుంబాలకు వందరోజులు పనిచేసే అవకాశం కల్పించామన్నారు.

ఈపథకం కింద ఇప్పటి వరకు రూ.9,597 కోట్లు ఖర్చు చేసి అందులో రూ.69 కోట్లు కూలీల కష్టానికి వేతనం అందించామన్నారు. రూ.358 కోట్లు మెటీరియల్ కోసం ఆర్థిక స్థిరత్వం కల్పించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 4,276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. కానీ తమ ప్రభుత్వంలో గ్రామీణ రహదారి గ్రూపులో 4వేల కోట్లతో నాలుగువేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించగలిగామన్నారు. ఇందుకు రూ .1600కోట్లు ఖర్చు చేశామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. చంద్రబాబు నాయకత్వంలో పల్లె పండుగ కానీ, ఇతర కార్యక్రమాలు విజయవంతం కావటానికి బలమైన ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న వ్యక్తి కావడమే కారణమన్నారు. ఆయన నాయకత్వంలో తాను కూడా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్ల సీసీ రోడ్లలో రూ.75కోట్లతో 117 కిలోమీటర్లు వేయగలిగామన్నారు. ఈ సందర్భంగా కర్నూలు కలెక్టర్ ను డిప్యూటీ సీఎం అభినందించారు. కర్నూలు కలెక్టర్ ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అందరూ ముందుకు వెళ్లాలన్నారు.

ఈ పథకంతో రాయలసీమకు లాభం…
మే నెలాఖరులోగా నీటి గుంతల పనులు పూర్తి చేయ‌డ‌మే లక్ష్యమన్నారు. వీటి వల్ల వర్షాకాలంలో ఒక టీఎంసీ నీటిని నిలువకు అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టులు వచ్చే వరకు ఈ పథకం రాయలసీమ ప్రాంతానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీరు నిల్వ చేసుకోవడం, భూగర్భ జ‌లాలను పెంచుకోవడంతో పాటు, పంట పొలాలకు నిరంతరంగా నీటిని అందించాయన్నారు. వీటి కింద అరటి, నిమ్మ, దానిమ్మ, జామ, కరివేపాకు లాంటి మొక్కలు పెంచితే రైతులకి ఆదాయం కూడా కలుగుతుందన్నారు. దీర్ఘకాలిక ఆదాయం నీటిలో కూడా చాపలు పెంచుకోవచ్చన్నారు. బాతుల పెంపకానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయానికి మరింత ఉపయోగక‌రంగా ఉంటుందన్నారు. రాయలసీమ నీటి కోసం పోరాడుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే తనకు అభిమానమన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు భైరెడ్డి శబరి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *