నషాముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ
డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి
కరీంనగర్ క్రైo, ఆంధ్రప్రభ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం (Police Commissioner Gaus Alam) అన్నారు. ‘నషాముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియం(Auditorium) లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ… నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, జిల్లాలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా చాలా మంది డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని, మత్తు పదార్థం మానసికంగా, శారీరకంగా తీవ్ర నష్టం చేస్తుందని తెలిపారు. ఒత్తిళ్లను అధిగమించేందుకు స్నేహితులతో మాట్లాడడం, పుస్తకాలు చదవడం, సామాజిక సేవ వంటి అనేక మార్గాలు ఉన్నాయని సూచించారు.
మత్తు పదార్థాల నివారణకు జిల్లాలో పోలీసు శాఖ (Police Department) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తోందని, డ్రగ్స్ నిర్మూలనకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని సీపీ వివరించారు. డ్రగ్ సంబంధిత సమాచారం తెలిస్తే నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని అమరవీరుల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమ్ రావ్, డి ఐ ఓ బి గంగాధర్, సిడిపిఓ సబిత, ఎన్ఎంబీఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

