Narayanpet | రోడ్డు భద్రతపై విద్యార్థులతో మానవహారం…

Narayanpet | రోడ్డు భద్రతపై విద్యార్థులతో మానవహారం…
Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్డు భద్రత మహోత్సవాలు – అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో ఈ రోజు విద్యార్థులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది కలిసి భారీ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డీఎం లావణ్య, ఆర్టీసీ డ్రైవర్లు, పోలీసులు, పాఠశాల–కళాశాల విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.“ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం – రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం” అనే నినాదంతో నిర్వహించిన మానవహారం వాహనదారుల్లో ప్రత్యేక చైతన్యం తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మితిమీరిన వేగం ప్రమాదాలకు దారి తీస్తుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, లైన్ డిసిప్లిన్ పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. అలాగే విద్యార్థులు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేయాలని అధికారులు సూచించారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గి, విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వాహనదారులు, డ్రైవర్లు, ప్రజలతో రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అరైవ్ అలైవ్ అంటే ఇంటి నుంచి సురక్షితంగా బయలుదేరి, సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకోవడమేనని అధికారులు స్పష్టం చేశారు.
