నంద్యాల మొక్కజొన్న రైతులు ఆందోళన
(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, అధిక వర్షం వల్ల పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు 40వేలు నష్టపరిహారం చెల్లించాలని, పంట పండించిన రైతులందరికీ పంటల బీమా వర్తింప చేయాలని, ప్రతి రైతుకు ఉచిత టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం (Collector Office) వద్ద రైతులందరూ గురువారం నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టారు.
జిల్లాలోని వివిధ మండలాల్లో మొక్కజొన్న సాగుచేసిన రైతుల (Farmers) తో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి, సీఐ జోక్యంతో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రంఇచ్చారు. జిల్లాలో1.57 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని తెలిపారు. ఒక్కొక్క ఎకరాకు రైతు 30 వేల రూపాయలు దాకా పెట్టుబడి పెట్టారని కలెక్టర్ కు వివరించారు. అత్యధిక వర్షాల మూలంగా పంట దిగుబడి ఎకరాకు 30 కింటాలు రావాల్సింది కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందన్నారు.
ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ. రాజశేఖర్ (A. Rajasekhar), జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు లు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మద్దతు ధరల విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.