Police..Police : నందికొట్కూర్ లో.. పోలీస్ పోలీస్ Andhra Prabha News

Police..Police : నందికొట్కూర్ లో.. పోలీస్ పోలీస్ Andhra Prabha News

కార్డన్ సెర్చ్ అల‌.జ‌డి

విస్తృత త‌నిఖీలు.. అఫెండ‌ర్స్ మాయం

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెయోరాన్ ఆదేశాలు

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కఠిన తనిఖీలు

రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు

అత్యవసర పరిస్థితుల్లో 112, 100కు కాల్ చేయాలని సూచన

( నందికొట్కూర్ , ఆంధ్రప్రభ)

ప్రజల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకొని నేరాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు నందికొట్కూరు మున్సిపాలిటీవ్యాప్తంగా విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెయోరాన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ ఆధ్వర్యంలో అర్బన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సమన్వయంతో ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.నందికొట్కూర్ లోని ముఖ్య ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, రహదారులు వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కఠినంగా తనిఖీలు నిర్వహించగా, నేరస్థుల కదలికలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు విస్తృతంగా పరిశీలనలు చేశారు. ఆదివారం నిర్వహించిన తనిఖీలలో ద్విచక్ర వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని అన్నారు.ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం నేరాలను ముందస్తుగా అరికట్టడం, ప్రజల్లో భద్రతా వాతావరణాన్ని మరింత బలపరచడం అని అధికారులు తెలిపారు. ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు.


అదే సమయంలో ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, రవాణా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలియజేశారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు.నందికొట్కూరు పట్టణవ్యాప్తంగా పోలీసు విభాగం సమన్వయం, స్థానిక ప్రజల సహకారంతో ఈ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు . భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలను నిరంతరం కొనసాగించి ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తామని సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.ఏదైనా అత్యవసర సమయంలో పోలీస్ వారి సహాయం కొరకు 112 లేదా 100 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని తెలియజేశారు.

Leave a Reply