operation cannabis మిర్చితోట కాదు.. గంజాయి వనం Andhra Prabha Crime News

operation cannabis మిర్చితోట కాదు.. గంజాయి వనం Andhra Prabha Crime News
చందర్లపాడులో గంజాయి గుట్టురట్టు.
10 కేజీల గంజాయి స్వాధీనం..
ఇద్దరు మహిళలు సహా నలుగురు పట్టివేత
అదుపులో మైనర్ బాలుడు..
పోలీసులు, రెవెన్యూ ఆపరేషన్
ప్రశాంత గ్రామాల్లోనూ మత్తు మాఫియా..
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )
ఎన్టీఆర్ జిల్లా లోని నందిగామ లక్ష్మీపురం గ్రామంలో గంజాయి సాగు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా వ్యవసాయ పంటలతో నిండే పొలాల్లోనే అక్రమంగా గంజాయి సాగు జరగడం గ్రామస్థులను ఉలిక్కిపడేలా చేసింది. చందర్లపాడు మండల పరిధిలోని ఈ గ్రామంలో మిర్చి తోట మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే పొలం వద్దకు చేరుకున్న అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి ఆ గంజాయి మొక్కలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సాగులో భాగస్వాములైన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా గంజాయి కొనుగోలు చేసి వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మైనర్ బాలుడు కూడా పట్టుబడినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో గ్రామానికి చెందిన మహిళ తనకు చెందిన భూమిలో మిర్చి పంట మధ్య గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు తేలింది. అక్రమంగా అధిక ఆదాయం పొందాలనే ఉద్దేశంతో ఈ సాగు చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మత్తు పదార్థాల సాగు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
