
Nandigama | వివాదాలు, గొడవలకు దూరంగా..
Nandigama | వివాదాలు, గొడవలకు దూరంగా..
- ఉంటామంటూ రౌడీ షీటర్ల ప్రమాణం..
- గత కేసులున్న వారికి నందిగామ పోలీసుల సూచనలు
- అసాంఘిక చర్యలపై కఠిన హెచ్చరిక
Nandigama | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడతతో వివిధ కేసుల్లో ఇరుక్కొని, తరచూ వివాదాలు, గొడవలకు పాల్పడుతున్న వ్యక్తులకు నందిగామ పోలీసులు శుక్రవారం ప్రత్యేకంగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఇకపై ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా జీవిస్తామని పోలీసుల ఎదుట వారు ప్రమాణం చేశారు. గతంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, సమస్యాత్మక పరిస్థితులకు కారణమైన వ్యక్తులను గుర్తించి, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసులు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ తరహా అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నందిగామ పోలీసులు మాట్లాడుతూ… టౌన్ మరియు మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ఎవరు కూడా గొడవలు, వివాదాలు, భయాందోళనలకు కారణమయ్యే చర్యలకు పాల్పడితే వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అవగాహన సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు కూడా ఇకపై శాంతియుతంగా ఉండి, సమాజంలో మంచి పౌరులుగా జీవిస్తామని, పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిగామ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.వి.వి.ఎల్. నాయుడు, ఉప నిరీక్షకులు బి. మోహన్ రావు, కె. సూర్యవంశీ, మహిళా ఉప నిరీక్షకురాలు వి. మహతితో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ చర్యలతో నందిగామ ప్రాంతంలో శాంతియుత వాతావరణం మరింత బలోపేతం అవుతుందని, ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని పోలీసులు తెలిపారు.
