Nalgonda : ఇండస్ట్రీ హబ్‌గా మిర్యాలగూడ…

  • త‌ర‌లిపోయిన చారిత్ర‌క సంప‌ద‌…
  • 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలి…
  • తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్‌

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇండస్ట్రీ హ‌బ్‌గా మిర్యాల‌గూడ‌ను ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత(MLC Kalvakuntla’s kavitha) అన్నారు. నల్లగొండ జిల్లా చారిత్రక సంపదను గుంటూరు జిల్లాకు తరలించుకుపోయారని ఆరోపించారు. ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

నాగార్జునసాగర్ లోని బౌద్ధ స్తూపం, నల్లగొండ పట్టణంలోని పచ్చల సోమేశ్వర ఆలయం(Someshwara Temple)లోని పలు చారిత్రక విగ్రహాలను గుంటూరుకు తరలించుకుపోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా తరలిపోయిన సంపదలను తిరిగి తెచ్చుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్యాలగూడను ఇండస్ట్రీ హబ్ చేయాలని క‌విత‌ డిమాండ్ చేశారు. దిండి లిఫ్ట్ స్కీం(Dindi Lift Scheme), నక్కల గండి, ఎస్ఎల్బీసీ సొరంగం పనులను వెంటనే పూర్తి చేసి కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ జిల్లాకు సాయుధ పోరాట చరిత్ర ఉందని ఇక్కడ ప్రజలు ఎంతో చైతన్యవంతులని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation of Constituencies) అయితే 65 నుండి 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పారు. త‌న అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించి జాగృతి కార్యకర్తలను అరెస్టు చేయించడం మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్థాయికి తగదని అన్నారు.

20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలి

పత్తి రైతు పరిస్థితి దయనీయంగా ఉందని, 20% తేమ ఉన్నా(20% Humidity) మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధనలను ఎత్తివేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై జాగృతి ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రికి, కేంద్ర మంత్రి లేఖ రాశామని కవిత చెప్పారు.

అంతకుముందు ఆమె నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ లు(Security Guards), దోబీలు ఇతర సిబ్బందితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు నెలలుగా వేతనాలు రావట్లేదు అని సిబ్బంది చెప్పడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply