Mylavaram | భూసమస్యల్లేకుండా చేస్తాం..

Mylavaram | భూసమస్యల్లేకుండా చేస్తాం..
- అధికారిక చిహ్నమైన రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Mylavaram | మైలవరం, ఆంధ్రప్రభ : రాష్ట్రప్రభుత్వం అధికారిక చిహ్నమైన రాజముద్రతో భూమి యాజమాన్య హక్కులను ధ్రువీకరిస్తూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీకి శ్రీకారం చుట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మైలవరం మండలంలోని దాసుళ్లపాలెం గ్రామంలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే ఈ రోజు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం మన ప్రధాన లక్ష్యమన్నారు. రీ సర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం అనేది ప్రథమ కర్తవ్యం కావాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తామని, రైతులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అందుకు అనుగుణంగా జనవరి 2 నుంచి పంపిణీకి కావాల్సిన నూతన పుస్తకాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేసిందన్నారు.
గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పాటు క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొత్త పాస్ బుక్స్‌ను బయోమెట్రిక్ విధానం ద్వారా అందజేస్తున్నారని, దీని ద్వారా ఈ కేవైసీ పూర్తి కాని వారికి సమస్య లేకుండా ఉంటుందన్నారు. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవడంతో పాటు ఇది ఒక రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నూతన పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో కూడా పట్టాదారుని వివరాలు తప్పుగా నమోదైతే వాటిపై తక్షణ చర్యలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ల లాగిన్ ద్వారా లబ్ధిదారుల ఆధార్, ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికక్కడే సరిదిద్దేలా ఏర్పాట్లు చేశామన్నారు. భూమి విస్తీర్ణం తప్పుగా నమోదైనా, చనిపోయిన వారి పేరుతో పాసు పుస్తకాల విడుదలైన వాటిని సరి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
