జనగామ, ఆంధ్రప్రభ : నిరుపేదలకు కనీస నివాస గృహం కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వంద శాతం త్వరగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
శుక్రవారం పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశంపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీవోలు, హౌసింగ్ పీడీ, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ముందుగా మండలవారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న ఇళ్ల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మంజూరు అయిన ప్రతి ఇంటి నిర్మాణం తప్పనిసరిగా ప్రారంభం కావాలని స్పష్టం చేశారు.
నిర్మాణాలు ఎందుకు ప్రారంభం కాలేదో అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా లబ్ధిదారులకు రుణాలు కల్పించి నిర్మాణాలు ప్రారంభించేందుకు సహకరించాలన్నారు.
మార్కింగ్ చేసినప్పటికీ ఇంకా బేస్‌మెంట్ పనులు ప్రారంభించని లబ్ధిదారులను సంప్రదించి సమస్యలు తెలుసుకొని వెంటనే పనులు మొదలయ్యేలా చూడాలని ఆదేశించారు.
సూర్యాపేట నుండి వచ్చే ఇసుకను త్వరగా సరఫరా చేసి లబ్ధిదారులకు అందేలా చూడాలని మైన్స్ ఏడీకి కలెక్టర్ ఆదేశించారు. రోజుకు కనీసం 50 ట్రిప్‌ల ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన లబ్ధిదారుల వెరిఫికేషన్‌ను రేపటిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ గూగుల్ మీటింగ్‌లో జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

