తొర్రూర్ టౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రప్రభ) : కాశ్మీర్ లోయ ప్రాంతమైన మరో స్విట్జర్లాండ్ ను తలపించే పర్యాటక ప్రాంతానికి విచ్చేసిన యాత్రికులపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడిని ఖండిస్తూ తొర్రూర్ పట్టణంలో ముస్లిం నాయకులు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎం.డి జలీల్, ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి అమీర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను చేత పట్టుకొని ర్యాలీని మస్జిద్ నుండి గాంధీ విగ్రహం మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించారు.
అనంతరం అమరవీరుల స్థూపం చౌరస్తాలో ముస్లిం నాయకులు మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులపై జరిపిన ఉగ్రవాదుల దాడిని తమ ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కవ్వింపు చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ పై కఠిన చర్యలకు పూనుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో ముష్కరులు వివిధ ప్రాంతాల్లో దాడులకు పాల్పడడం ఎంతో విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో జామ మసీదు సదర్ కమిటీ అధ్యక్షుడు అలీమ్, కార్యదర్శి ఎండి మౌలానా, కోశాధికారి యూసఫ్, అమీర్, జలీలు, ఖలీల్, బషీర్, సైదులు, గౌస్ పాషా, గఫార్, తదితరులు పాల్గొన్నారు.