Mothkur | గేమ్ ఛేంజర్.. ఎంపీ చామల..

Mothkur | గేమ్ ఛేంజర్.. ఎంపీ చామల..
- పార్టీ ఫండ్ తో.. గ్రాఫ్ చేంజ్
- ఒక్క రోజులో తారు మారు
- కాంగ్రెస్ అభ్యర్డుల గెలుపులో.. ఎంపీ కీలక పాత్ర..
Mothkur, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గేమ్ ఛేంజర్ గా మారారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. తిరుమలగిరిలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందన్న విషయం ఖరారు కావడంతో.. ఉన్న ఒక్క మోత్కూర్ మున్సిపాలిటీ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. చివరి క్షణంలో పార్టీ అభ్యర్థుల ఎంపికలో సైతం కీలక పాత్ర పోషించారు. ఎట్టకేలకు కొన్ని వార్డులలో అభ్యర్థుల మార్పులు సైతం చేపట్టారు.
కీలకమైన పోలింగ్ ముందు రోజు మధ్యాహ్నం వరకు ఇంటెలిజెన్స్, ప్రయివేటు సర్వేల ఆధారంగా ఎక్కడెక్కడ తమ పార్టీ అభ్యర్థులు వీక్ గా ఉన్నారో.. ఆయా వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎక్కువ మొత్తంలో పార్టీ ఫండ్ అందించి.. చివరి క్షణం లో కాంగ్రెస్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాస్త నిలబెట్టారు. 7 వార్డులలో కాంగ్రెస్, 5 వార్డులలో బీఆర్ఎస్ గెలుస్తుందని, పలు వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో సైతం వెనకబడ్డారని సర్వే రిపోర్ట్ లు రావడంతో.. రంగంలోకి దిగిన ఎంపీ చామల 3, 4 రోజుల పాటు ఓ ఫామ్ హౌజ్ లో ఉండి నేరుగా కాంగ్రెస్ అభ్యర్థులు, ఇంచార్జ్ లతో మంతనాలు జరిపి ఆయా అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఆయా అభ్యర్థులకు పోలింగ్ కి ఒక్క రోజు ముందుగా పార్టీ ఫండ్ ను అందించడంతో.. ఒక్క రోజు లోనే గేమ్ చేంజర్ గా మారిన ఎంపీ చామల… కాంగ్రెస్ అభ్యర్థుల గ్రాఫ్ చేంజ్ చేశారంటే ఇది నమ్మశక్యమే..! ఏది ఏమైనప్పటికీ మోత్కూర్ మున్సిపాలిటీ లో ఒక దశలో చైర్మన్ పీఠం తమకే వస్తుందని అంచనాలు వేసిన బీఆర్ఎస్ పార్టీకి… ఆయా వార్డులలో దిమ్మతిరిగేలా ఎంపీ చామల చెక్ పెట్టారు. దీంతో ఆయా వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్ఘాంత పోయారు.
మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా.. చక్రం తిప్పిన చామల..!
మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో చక్రం తిప్పిన చామల ఏకంగా కాంగ్రెస్ పార్టీకి 8 వార్డులు రావడంతో ఎంపీతో పాటు, ఎమ్మెల్యే సామెల్ సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ తో పాటు 4 కో ఆప్షన్ సభ్యులు సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులకు దక్కనున్నాయి. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ 7 స్థానాలు సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 4 కో ఆప్షన్ పదవులు పొందగా.. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు సాధించి చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులతో పాటు 4 కో ఆప్షన్ పదవులు పొందనున్నారు.
