Mother Son | ఆస్పత్రికి వెళ్తుండగా…

Mother Son | ఆస్పత్రికి వెళ్తుండగా…
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి మృతి
Mother Son | గండేపల్లి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్తుండగా.. తల్లి, కుమారుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కుమారుడు అనారోగ్యానికి గురవడంతో మెరుగైన వైద్యం కోసం తల్లి, బంధువులు విశాఖపట్నం తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్రేయపురం మండలం వెలుచూరు గ్రామానికి చెందిన తోర్లపాటి తులసి (40)కి సంజయ్, శశికుమార్ (24) అనే ఇద్దరు కుమారులున్నారు. శశికుమార్‌కు క్యాన్సర్ వ్యాధి ఉంది. విశాఖపట్నంలోని ఆస్పత్రికి వెళ్లేందుకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు, బంధువులు తోర్లపాటి పాపారావు, నాగబత్తుల శ్రీను కారులో బయల్దేరారు.
ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గండేపల్లి శివారుకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ట్రాలీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తులసి అక్కడికక్కడే మృతిచెందగా.. శశికుమార్‌ను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కూడా మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివనాగబాబు తెలిపారు.
