ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (నెగిటివ్ రోల్) నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీప్రధాన పాత్రలో కనిపించారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్యాన్-ఇండియా స్థాయిలో, హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది. అయితే, అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ యాక్షన్ మూవీ, మొదటి షో నుంచే పెద్ద నిరాశ కలిగించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల బయట ప్రేక్షకుల నుంచి ఎక్కువగా నెగిటివ్ టాక్ వినిపించింది.

ముఖ్యంగా, మొదటి భాగమైన ‘వార్’లో కనిపించిన అయాన్ ముఖర్జీ ప్రత్యేకమైన‌ మేకింగ్ & స్టైల్ ఈ సీక్వెల్‌లో కనిపించలేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌ను మరింత గ్రాండ్‌గా చూపిస్తారని అభిమానులు ఊహించినప్పటికీ, ఆ హైప్‌కి తగ్గ సన్నివేశాలు పెద్దగా కనిపించలేదని టాక్ వినిపిస్తోంది. అలాగే హీరోయిన్ కియారా అద్వానీ, సీనియర్ నటుడు అనిల్ కపూర్ పాత్రలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అభిమానులు భావిస్తున్నారు.

మొదటి భాగం ‘వార్’తో పోలిస్తే, ‘వార్ 2’లో అయాన్ ముఖర్జీ నరేషన్ బలహీనంగా ఉందని, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కథను ఆకట్టుకునేలా నడపలేకపోయారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్‌ నుండి వచ్చే ప్రాజెక్ట్ కావడంతో విజువల్స్, టెక్నికల్ స్టాండర్డ్స్ టాప్ క్లాస్‌లో ఉంటాయని చాలామంది ఆశించారు. అయితే, కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ నాణ్యత తగ్గిపోవడం, కొన్ని యాక్షన్ సన్నివేశాలు సహజంగా అనిపించకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది.

కథలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి నిరాశ కలిగించిన అంశంగా చెబుతున్నారు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఇష్టపడేవారికి కొన్ని ఫైట్స్ బాగున్నప్పటికీ, సాధారణ ప్రేక్షకులు కథలో భావోద్వేగం లేకపోవడంతో కనెక్ట్ కాలేకపోయారు.

సంగీత విభాగంలోనూ సినిమా పెద్దగా మెప్పించలేదని టాక్. ప్రేక్షకుల ఉత్సాహాన్ని పెంచే హిట్ సాంగ్స్ లేకపోవడం, నేపథ్య సంగీతం కూడా యావరేజ్ స్థాయిలో ఉండటంతో సినిమా ఇంపాక్ట్ తగ్గిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, భారీ అంచనాలతో విడుదలైన ‘వార్ 2’ అభిమానుల అంచనాలకు పూర్తిగా న్యాయం చేయలేదనే అభిప్రాయం సోషల్ మీడియాలో విస్తరిస్తోంది.

హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబో కోసం దేశవ్యాప్తంగా అభిమానులు నెలల తరబడి ఎదురుచూశారు. రిలీజ్ ముందు సినిమాపై భారీ హైప్ ఉండటం వల్ల వసూళ్లు ఓపెనింగ్ వీకెండ్‌లో బాగానే ఉండొచ్చని అంచనా. కానీ నెగిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

Leave a Reply